Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ఇక 11 గంటల వరకే నిత్యావసరాలు

ఏపీలో ఇక 11 గంటల వరకే నిత్యావసరాలు
X

ఏపీలో కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో నిత్యావసరాల కొనుగోలు సమయాన్ని ఒంటి గంట నుంచి పదకొండు గంటలకే పరిమితం చేశారు. చాలా చోట్ల ఈ వెసులుబాటును దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు రావటంతో ఆదివారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిపుణల సూచనల మేరకు సమయాన్ని కుదించినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. ఉదయం 11 గంటల తర్వాత ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. గ్రామాల్లో మాత్రం నిత్యావసరాల కొనుగోలుకు మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు ఒక్కసారిగా బయటకు రావద్దని సూచించారు. ‘నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. నిత్యావసరాలకు ఏ కొరత లేకుండా చూస్తాం. నిత్యావసర వస్తువుల విక్రయాలపై కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ఆదేశించారు.

ప్రతి షాపు వద్ద నిత్యావసర వస్తువుల ధరల పట్టిక ఏర్పాటు చేయడంతో పాటు.. కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా పట్టికలో చూపించాలి. వ్యవసాయ కూలీల రాకపోకలను అడ్డుకోవద్దని సీఎం జగన్‌ చెప్పారు. ఎక్కడ కూడా వ్యవసాయ ధరలు పడిపోవడానికి వీల్లేదు. అందుకోసం మొబైల్స్‌ మార్కెట్స్‌ ఏర్పాటు చేస్తాం. గ్రామ వాలంటీర్లు సర్వేను మరింత పటిష్టంగా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు చెప్పారు. అత్యవసరంగా వచ్చినా వారు ఎవరైనా క్వారంటైన్‌లో ఉంచుతాం. విదేశాల నుంచి వచ్చినవారిని పూర్తి స్థాయిలో గుర్తిస్తున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారికి అన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్‌ చెప్పారు. నగరాల్లో, పట్టణాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు’ అని ఆళ్ల నాని తెలిపారు.

Next Story
Share it