Telugu Gateway
Andhra Pradesh

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం
X

కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేకపోవటంతో ఏపీ సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఈ తరుణంలో ప్రతిపాదిత బడ్జెట్ కు శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం వివరాలను ఏపీ రవాణా, సమాచార శాఖల మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. ‘‘మూడు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సుమారు 28వేల మంది విదేశీయులు, ఎన్నారైలను గుర్తించాం. కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్‌ వార్డులు ఏర్పాటు చేశాం. జిల్లాస్థాయిలో కోవిడ్‌-19 ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతిలో ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. ఏప్రిల్‌ 14 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగిస్తాం.

52వేల ఎన్‌-95 మాస్క్‌ లను అందుబాటులోకి తెచ్చాం. వైద్యుల కోసం ప్రత్యేక బాడీ మాస్క్‌లను 4వేలకుపైగా సిద్దం చేశాం. జిల్లా, నియోజకవర్గస్థాయిలో ఏర్పాటు చేసిన ఆస్పత్రులకు కూడా అన్ని వసతులు సమకూర్చాం. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలి. సామాజిక దూరం పాటించాలి. తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి’ అని సూచించారు. అదే సమయంలో మీడియా వైఖరిని ఆయన తప్పుపట్టారు. కొన్ని మీడియాలు ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ రేటింగ్‌ల కోసం ప్రయత్నిస్తారా? సమాజహితం అవసరం లేదా?’ మంత్రి ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల వద్ద జరిగిన సంఘటనలను కొన్ని మీడియాలు తప్పుగా చిత్రీకరించిన తీరును ఆయన తప్పుబట్టారు. క్వారంటైన్‌ చేయకుండా రాష్ట్రంలోకి ఎలా అనుమతిస్తామని అన్నారు. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండా ఇళ్లకు పంపితే ముప్పు తప్పదని హెచ్చరించారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. నిరాశ్రయులందరినీ కల్యాణమండపాల్లో ఉంచాలని ఆదేశించామన్నారు. దాతలు అధికారుల ద్వారా సాయం అందించవచ్చని కోరారు. భోజనాలకు ఇబ్బందిపడేవారికి వాలంటీర్ల ద్వారా సాయం అందిస్తామని తెలిపారు.

Next Story
Share it