Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు

చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
X

వైజాగ్ ఎయిర్ పోర్టులో 45 నిమిషాల పాటు అడ్డంకులు

వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణతో ఉద్రిక్తంగా మారిన వైజాగ్

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి వైజాగ్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. గురువారం ఉదయం నుంచే వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని అనేది తమ విధానం అని చంద్రబాబు చెబుతుంటే..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులు అన్నది వైసీపీ నినాదంగా మారింది. వైజాగ్ లో అధికార వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని..అక్కడికి వెళ్ళే వాళ్ల సంగతి చూస్తానని చంద్రబాబు ప్రకటించారు. దీంతో వైసీపీ కూడా అంతే స్థాయిలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు రెడీ అయింది. విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రబాబును రిసీవ్ చేసుకునేందుకు వెళ్లిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వాసుపల్లి గణేష్ వంటి వాళ్ళకు కూడా వైసీపీ శ్రేణులు ఆటంకం కలిగించాయి. వాళ్ల వాహనాలు ముందుకెళ్ళకుండా అడ్డుకున్నారు.

పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేయటం కష్టం అయింది. దీంతో విమానాశ్రయం రణరంగంగా మారిపోయింది. చంద్రబాబునాయుడు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఆయన కాన్వాయ్ ను వైసీపీ కార్యకర్తలు దాదాపు 45 నిమిషాల పాటు విమానాశ్రయం వద్దే అడుగు ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను అడ్డుకుంటున్న చంద్రబాబు వైజాగ్ కు ఎలా వస్తాడంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైజాగ్ వచ్చి ఇక్కడ రాజధాని వద్దని చంద్రబాబు చెప్పగలరా? అని మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు.

Next Story
Share it