Telugu Gateway
Andhra Pradesh

జగన్ ఏడుసార్లు వెళ్లినా ఏడు రూపాయలు రాలేదు

జగన్ ఏడుసార్లు వెళ్లినా ఏడు రూపాయలు రాలేదు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విమాన ఛార్జీలు దండగ తప్ప..ఆయన పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చిందేమీ లేదన్నారు. ఏడుసార్లు పర్యటించి కనీసం ఏడు రూపాయలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. యనమల రామకృష్ణుడు గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన నిధులుతప్ప, జగన్‌ ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏమీ సాధించలేదన్నారు.జగన్‌ ప్రజలకోసం ఢిల్లీవెళ్లారో, వ్యక్తిగత ప్రయోజనాలకోసం వెళ్లాడో అందరికీ అర్థమైంది. జగన్‌ కేంద్రానికి ఇచ్చిన విజ్ఞాపనపత్రం చూస్తే, నవరత్నాలు, సహా రాష్ట్ర పథకాలు అన్నింటికీ కేంద్రమే నిధులివ్వాలన్నట్లుగా ఉంది.

ముఖ్యమంత్రి మౌనంగా రావడం చూస్తే, ఆయనకేదో చీవాట్లు పడ్డట్లే కనిపిస్తోంది. జగన్‌ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై చర్చించడానికే ఆయన్ని ఢిల్లీకి పిలిచారనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అమరావతిలో ల్యాండ్‌పూలింగ్‌ తప్పనిచెప్పి, విశాఖపట్టణంలో ఇదే పద్ధతి ఎలా అవలంభిస్తారు అని ప్రశ్నించారు. భూకబ్జాల కోసమే విశాఖలో రాజధాని అంటున్నారని యనమల మండిపడ్డారు. ప్రజలెవరూ కోరకుండానే మూడురాజధానుల నిర్ణయం సహా, అనేక నిర్ణయాలతో రాష్ట్రప్రతిష్టను ముఖ్యమంత్రి ఘోరంగా దెబ్బతీశాడన్నారు.

Next Story
Share it