Telugu Gateway
Politics

‘ట్రంప్’ పై వీగిన అభిశంసన తీర్మానం

‘ట్రంప్’ పై వీగిన అభిశంసన తీర్మానం
X

ఊహించిందే...జరిగింది. అయినా ఓ లాంఛనం పూర్తి అయింది. అభిశంసన తీర్మానం వీగిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెనేట్ లో విజయం సాధించారు.దీంతో ఆయనకు ఊరట లభించినట్లు అయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ను అభిశంసిస్తూ దిగువ సభలో ఆమోదం పొందిన తీర్మానాన్ని సెనేట్‌ గురువారం తిరస్కరించింది. ఈ మేరకు అభిశంసన తీర్మానం సెనేట్‌లో వీగిపోయిందని శ్వేతసౌధం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘‘డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నేటితో ముగిసింది. మేము గతంలో చెప్పినట్లుగా ట్రంప్‌ నిర్దోషిగా తేలారు. నిరాధారమైన అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా సెనేట్‌ ఓటు వేసింది. అధ్యక్షుడి రాజకీయ ప్రత్యర్థులైన డెమొక్రాట్లు, అధ్యక్ష బరిలోని నిలవాలని ఆశించి భంగపడిన ఓ రిపబ్లికన్‌ మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు’’ అని తెలిపింది.

ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా ప్రతినిధుల సభ ట్రంప్‌ను అభింసించిన విషయం తెలిసిందే. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ నాయకుడు జో బైడన్‌ నుంచి గట్టి పోటీ నెలకొని ఉందన్న వార్తల నేపథ్యంలో... బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్‌ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే విధంగా ఆయనపై కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష డెమొక్రాట్లు అభింశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభలో సంఖ్యా బలం కలిగిన డెమొక్రాట్లు ఈ తీర్మానానికి ఆమోదం తెలపగా.. ఆ తీర్మానం సెనేట్‌కు చేరుకుంది. ఈ క్రమంలో సెనేట్‌లో మెజారిటీ కలిగిన రిపబ్లికన్లు... అభిశంసన తీర్మానాన్ని వ్యతిరేకించడంతో ట్రంప్‌ నిర్దోషిగా తేల్చారు.

Next Story
Share it