ఏపీలో వైసీపీ..టీడీపీ మధ్య ‘ఐటి ఫైట్’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ‘ఐటీ ఫైట్’ సాగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఐటి శాఖ గురువారం నాడు విడుదల చేసిన ఓ ప్రకటన. ఈ ప్రకటనలో చంద్రబాబు మాజీ పీఎస్ తోపాటు మూడు ఇన్ ఫ్రా కంపెనీల లావాదేవీలతో పాటు మొత్తం నలభై చోట్ల నిర్వహించిన తనిఖీల్లో 2000 కోట్ల రూపాయల లెక్కల్లో చూపని ఆదాయం తేలినట్లు ప్రకటించారు. సహజంగా ఈ జాబితాలో చంద్రబాబు మాజీ పీఎస్ ఉండటంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. దీంతోపాటు చంద్రబాబు తన హయాంలో పలు కంపెనీలకు అడ్డగోలుగా కాంట్రాక్ట్ లు కట్టబెట్టి కమిషన్లు దండుకున్నారనే వైసీపీ ఆరోపిస్తోంది. అందుకే ఐటి శాఖ నోట్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఏకంగా వైసీపీ నేతలు రంగంలోకి చంద్రబాబును అరెస్ట్ చేయాలనే డిమాండ్ ను అందుకున్నారు. టీడీపీ కూడా వెంటనే రంగంలోకి దిగి కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. ఐటీ దాడులకు తెలుగుదేశం పార్టీకి ఏమి సంబంధం అని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
ఐటి దాడుల పేరుతో వైసీపీ టీడీపీపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు మాజీ పీఎస్ ఓ ప్రభుత్వ ఉద్యోగి అని..అతనితో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని అన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ అంశంపై స్పందించారు. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా ఈ వ్యవహారం ఉందన్నారు. ఇన్ ఫ్రా కంపెనీల్లోని లెక్కల్లో ఏమైనా తేడాలు ఉంటే ఆ కంపెనీలు చూసుకుంటాయని..వాటితో తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏముందని ప్రశ్నించారు. జగన్ కు జైలు భయం పట్టుకుందని ఆరోపించారు. అయిత వైసీపీ నేతలు మాత్రం దూకుడు పెంచారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మాజీ పీఎస్ దగ్గరే రెండు వేల కోట్ల రూపాయలు దొరికాయంటే చంద్రబాబు దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని వ్యాఖ్యానించారు. సజ్జలతోపాటు మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు ఐటి దాడులకు సంబంధించి వరస పెట్టి టీడీపీపై ఎటాక్ స్టార్ట్ చేశారు. విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ తమ అక్రమాలు బయటపడుతుండటంతో చంద్రబాబు, లోకేష్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌ల పాస్ పోర్టులు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఐటీ దాడులపై లోతైన విచారణ జరపాలని, బాబును కూడా విచారించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమాస్తులను వెంటనే స్వాధీనం చేసుకుని ఖజానాకు జమ చేయాలన్నారు.