Telugu Gateway
Andhra Pradesh

అప్పటి చంద్రబాబు అంచనాలే..ఇప్పటి జగన్ అంచనాలు!

అప్పటి చంద్రబాబు అంచనాలే..ఇప్పటి జగన్ అంచనాలు!
X

మరి అప్పటి అవినీతి ఇప్పుడు లేదా?

జగన్ రివర్స్ గేర్లు ఎన్నో

చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు అంచనాలను 55,548 కోట్ల రూపాయలకు పెంచారు. దీనిపై అప్పట్లో వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దండుకోవటానికే అడ్డగోలుగా అంచనాలు పెంచారంటూ ఆరోపించారు. జగన్ దగ్గర నుంచి వైసీపీ నేతలు అందరిదీ అదే దారి. టీడీపీ ఓడిపోయింది..జగన్ అధికారంలోకి వచ్చారు. మరి ప్రతిపక్షంలో ఉండగా దోపిడీ అంచనాలు అని చెప్పిన అవే అంచనాలను జగన్ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీకి చెప్పి ఆమోదించాలని కోరటం వెనక మతలబు ఏమిటి?. అప్పుడు ఆ అంచనాలు దోపిడీ కోసం అయితే వాటినే యదాదథంగా ఎందుకు ఆమోదించాలని జగన్ కోరుతున్నారు?. ఈ ప్రశ్నలకు సమాధానం ఏదీ?. అవినీతిని ఏ మాత్రం సహించనని చెప్పే జగన్ దోపిడీ అంచనాలను సవరించకుండా కోరటం వెనక మతలబు ఏమిటి అన్నదే ఇప్పుడు తేలాల్సిన అంశం.

చంద్రబాబు తరహాలోనే జగన్ కూడా రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను వదిలేసి సాయం చేయండి చాలు అన్నట్లు వ్యవహరించటం ఏపీలోని అధికార వర్గాలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. ఉదాహరణకు కడప స్టీల్ ప్లాంట్. విభజన చట్టం ప్రకారం కేంద్రమే ఈ స్టీల్ ప్లాంట్ పెట్టాలి. కానీ జగన్ సీఎం అయిన తర్వాత ఐదేళ్లు ఎదురుచూశామని..కేంద్రం ముందుకు రాకపోవటంతో తామే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కడప స్టీల్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని అంటూ కొద్ది నెలల క్రితం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేశారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన సందర్భంగా కడప స్టీల్ ప్లాంట్ కు ఆర్ధిక సాయం చేయాలని కోరారు. విభజన చట్టం ప్రకారం ఇది రాష్ట్ర హక్కు. సాయం వేరు..హక్కు వేరు.

ప్రత్యేక హోదా అన్నది సాంకేతికంగా చూస్తే అది సభలో ఇచ్చిన హామీనే. కానీ స్టీల్ ప్లాంట్ అలా కాదు. అది విభజన చట్టంలోనే స్పష్టంగా ఉంది. కానీ హక్కులను కూడా వదిలేసుకుని నిధులు ఇవ్వండి అని అడగటం ఏ మాత్రం సరికాదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే సమయంలో రామాయపట్నం పోర్టు విషయంలోనూ అదే వైఖరి. విభజన చట్టం ప్రకారం కేంద్రమే ఏపీలో ఓ మేజర్ పోర్టును అభివృద్ధి చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ కూడా జగన్ తామే పోర్టును అభివృద్ధి చేసుకుంటామని ..కేంద్రం నిధులు ఇవ్వాలని కోరతున్నారు. చట్టంలో ఉన్న వాటిని అమలు చేయని కేంద్రం..సాయం అడిగితే చేస్తుందా?. రాష్ట్ర విభజనతో రాజధాని లేకుండా పోయిన ఏపీకి పునర్విభజన చట్టం ప్రకారం భవనాల నిర్మాణాలు, మౌలికసదుపాయాల కల్పనకు కేంద్రమే నిధులు ఇవ్వాల్సి ఉంది. కానీ దీనికి ఎంత కేంద్రం ఏ మేరకు సాయం చేస్తుందో ఎవరికీ ఏమీ తెలియదు.

Next Story
Share it