Telugu Gateway
Andhra Pradesh

న్యాయ రాజధానిలో ఆడబిడ్డకు న్యాయం చేయరా?

న్యాయ రాజధానిలో ఆడబిడ్డకు న్యాయం చేయరా?
X

కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఓ ఆడబిడ్డకు న్యాయం చేయమంటే మాత్రం పట్టించుకోవటంలేదు. అన్యాయానికి గురైన మహిళ రోడ్డెక్కి తనకు న్యాయం చేయాలని కోరుతున్నా ఈ ప్రభుత్వం స్పందించటంలేదని..సుగాలి ప్రీతికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ర్యాలీ ఫర్ జస్టిస్ అంటూ పవన్ కళ్యాణ్ బుధవారం నాడు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ దిశ కేసు తరహాలోనే కర్నూలు అమ్మాయి సుగాలి ప్రీతిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తాను నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని తానేమి డిమాండ్ చేయడం లేదన్నారు. ప్రీతి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన కరువు అవ్వడంతోనే తాను రోడ్డెక్కాల్సి వచ్చిందని పవన్ అన్నారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించకుంటే.. తాను మానవ హక్కుల సంఘం తలుపు తడతానని పవన్ హెచ్చరించారు. దిశ అత్యాచారం, హత్య కేసు గురించి అసెంబ్లీలో ప్రసంగాలు చేసిన సీఎం జగన్.. కర్నూలులో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాయలసీమలో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే జగన్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ర్యాలీ ఫర్ జస్టిస్.. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుతో వేలాది మంది తరలి వచ్చి సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ ర్యాలీలో సుగాలి ప్రీతి తల్లి పార్వతీ బాయితోపాటు జనసేన నాయకులు పలువురు పాల్గొన్నారు.

Next Story
Share it