Telugu Gateway
Andhra Pradesh

జగన్ ఆస్తులు సీబీఐ..ఈడీలు ప్రకటిస్తాయి

జగన్ ఆస్తులు సీబీఐ..ఈడీలు ప్రకటిస్తాయి
X

దేవాన్ష్ ఆస్తి 19.42 కోట్లు..లోకేష్ ఆస్తి 24 కోట్లు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం క్రమం తప్పకుండా తొమ్మిదేళ్ళుగా ఆస్తులు ప్రకటిస్తోందని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మాత్రం సీబీఐ, ఈడీలు ప్రకటిస్తాయని ఎద్దేవా చేశారు. అలా కాకుండా సొంతంగా జగన్ తన ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ గురువారం నాడు మంగళగిరి టీడీపీ ఆఫీసులో మరో సారి ఫ్యామిలీ ఆస్తులను ప్రకటించారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు పెరిగాయని తెలియజేశారు. చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు.. అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయని తెలిపారు. తన తల్లి భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గిందని తెలిపారు. నారా లోకేష్ ఆస్తి 24 కోట్లు.. బ్రాహ్మణి ఆస్తి 15 కోట్ల 68 లక్షలు.. దేవాన్ష్‌ ఆస్తి 19 కోట్ల 42 లక్షలుగా ఉన్నాయని వివరించారు. ఇక తన పేరిట ఉన్న షేర్లు బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు. దేశంలో ఏ పార్టీలో లేని విధంగా4300 మంది కార్యకర్తల కుటుంబాలను ప్రమాద బీమా ద్వారా ఆదుకున్నట్లు తెలిపారు.

తనను విమర్శించే వాళ్లంతా ముందు ఆస్తులు ప్రకటించాలని నారా లోకేష్‌ డిమాండ్ చేశారు. ‘‘బినామీ భూములు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్నారు.. వైసీపీ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైంది.. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. క్రమశిక్షణ, పట్టుదలతో వ్యాపారం, రాజకీయాలు చేస్తున్నాం. కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. పీఏ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీకి రూ.2.68 లక్షలు దొరికాయి.. ఆయనకే తిరిగి ఇచ్చేశారు. మేం ఏనాడు తప్పు చేయలేదు.. ఏం దొరకనప్పుడు ఏమి చెప్పాలి?. నిండా మునిగిన వాళ్లు ఏం మాట్లాడరు కానీ.. ఏం దొరికాయని మేం సమాధానం చెప్పాలి.’’ అని ప్రశ్నించారు. జగన్‌ 43 వేల కోట్ల అవినీతి రుజువైందని నారా లోకేష్ అన్నారు. జగన్‌లా మేం బినామీలు కంపెనీలు పెట్టలేదని చెప్పారు. బినామీ కంపెనీల ద్వారా ఇళ్లు కట్టలేదు.. కార్లు కొనలేదని పేర్కొన్నారు. వైసీపీలో కోడిగుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్ ఉందని విమర్శించారు. తమ ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం లెక్కలు వెయ్యలేదన్నారు.

Next Story
Share it