Telugu Gateway
Andhra Pradesh

ముందు జగన్ భక్తులం..తర్వాతే మంత్రులం

ముందు జగన్ భక్తులం..తర్వాతే మంత్రులం
X

‘ముందు మేం జగన్ భక్తులం..అనుచరులం. తర్వాతే మంత్రి పదవి. మంత్రి పదవి ఉంటే ఉంటుంది..ఊడితే ఊడుతుంది. దాని గురించి మేం ఎప్పుడూ భయపడం. కానీ జగన్ అనుచరులం. భక్తులం అనేదే మాకు అన్నింటి కంటే ఎక్కువ. అదే మాకు శాశ్వతం’ అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై అనిల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మూడో కన్ను తెరిస్తే భస్మం అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఏమైనా అంటే సహించేదిలేదన్నారు. ముస్లింలకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సీని రాష్ట్రంలోకి రానిచ్చే ప్రసక్తే లేదని సీఎం వైఎస్‌ జగన్‌ సృష్టం గా చెప్పారని తెలిపారు. నంద్యాలలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారని.. తాను నెల్లూరు రాజకీయాల్లో పోటీ చేసిన ప్రతీసారి ముస్లిం లు వలనే గెలవగలిగానని ఆయన పేర్కొన్నారు.

సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం మంచిది కాదని మంత్రి అనిల్‌ తెలిపారు. పార్లమెంటులో తమ ఎంపీ మిథున్‌ రెడ్డి ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ మాట్లాడారని.. టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అమరావతి అంటూ.. చంద్రబాబుకు జోలె పట్టుకుని బిక్షాటన చేయడం మాత్రమే తెలుసునని.. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏపై మాట్లాడే దమ్ము లేదని దుయ్యబట్టారు. కేవలం 29 గ్రామాల కోసం ఆయన బినామీ, బంధువుల ఆస్తులు పోతాయని జోలె పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. 151 అసెంబ్లీ సీట్లు సాధించి.. దేశంలోనే చరిత్ర సృష్టించిన వైఎస్సార్‌సీపీ లాంటి పార్టీని గాలిలో కలుపుతామంటారా అంటూ టీడీపీపై మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ 10 సంవత్సరాల తన రెక్కల కష్టంతో.. 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొంది సంచలన విజయం సాధించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ పెట్టిన తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి.. దమ్ముంటే సొంతగా పార్టీ పెట్టి గెలవాలని చంద్రబాబుకు అనిల్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీపై మమకారంతో చంద్రబాబుకు ఓట్లు వస్తున్నాయి తప్ప.. ఆయన ముఖం చూసి కాదన్నారు. లేకుంటే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. జగన్ కు క్షమా,దయా గుణం ఉండటంతో టీడీపీ ఎన్ని కుట్రలు చేస్తున్నా సహిస్తున్నారని మంత్రి అనిల్‌ వ్యాఖ్యానించారు.

Next Story
Share it