Telugu Gateway
Andhra Pradesh

రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం

రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం
X

మీడియాపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలకు మంచి పనులు చేస్తుంటే కూడా కొన్ని మీడియా సంస్థలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. తాము రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. సోమవారం నాడు విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లల చదువు గురించి ఆలోచించే ప్రభుత్వం తమది అని తెలిపారు. బలహీనవర్గాలకు చెందిన వారికి మనం ఇచ్చే ఆస్తి చదువేనన్నారు. అమ్మ ఒడి ద్వారా కాని పలు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా పేదల కోసమేనని ఆయన అన్నారు.ఇలాంటి ప్రభుత్వం మీద రోజూ విమర్శలు చేస్తున్నారు.కొంతమంది .వారిని ఏమనాలి ? రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోవాలని డబ్బులు ఇచ్చి పత్రికలలో రాయిస్తున్నారు.అన్ని ప్రాంతాలు బాగుపడాలని ఆలోచిస్తుంటే దాడులకు పాల్పడుతున్నవారిని, వారికి మద్దతు ఇస్తున్న మీడియాను ఏమనాలి? జనాభా దామాషా ప్రకారం స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుపడుతున్నారు. ఈ కార్యక్రమాల వల్ల చంద్రబాబును పూర్తిగా మర్చిపోతారన్న భయంతో కొన్ని పత్రికలు,టివి చానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయి.అయినా లక్ష్య సాదనలో ముందుకు వెళ్లే విధంగా ప్రజలు ఆశీర్వదించాలి. ఏ తప్పు జరగకపోయినా,ఏదేదో జరిగిపోయినట్లు రాస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా పేదల బతుకు మారలేదని.. నిరుపేదల జీవితాలలో మార్పులు రావాలని ఆకాక్షించారు.

పేదల బతుకులు మారాలంటే వారి కుటుంబాలలో ఎవరో ఒకరు ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్ అవ్వాలన్నారు. ఇంటర్ తర్వాత కళాశాలలో చేరేవారి సంఖ్య రష్యాలో 81 శాతం, బ్రెజిల్, చైన్ దేశాలలో 50 శాతం ఉండగా ఇండియాలో కేవలం 23 శాతం మాత్రమే ఉందన్నారు. ఇటువంటి పరిస్ధితులు ఉంటే కుటుంబాలు పేదరికం నుంచి ఎలా బయటపడతాయని సీఎం అన్నారు. ‘పేద విద్యార్థులకు ప్రతి ఏటా రూ.20వేలు వసతి దీవెన అందిస్తాం. డిగ్రీ, పీజీ జరిగే విద్యార్థులకు రెండు విడతలుగా రూ.20వేలు ఇస్తాం. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి ఇస్తామని’ సీఎం తెలిపారు. 1 లక్ష 87వేల మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. వసతి దీవెన కింద రూ. 2,300 కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. పేదల జీవితాలలో మార్పు తీసుకురావడానికే ఈ వసతి దీవెన పథకం అని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌లో విద్యా దీవెన పథకం కింద ఏడాదికి 3,700 కోట్లు ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ రెండు పథకాలతోనే 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా 6,400 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నామన్నారు.

Next Story
Share it