Top
Telugu Gateway

గ్రామాల రూపు రేఖలు మారాలి

గ్రామాల రూపు రేఖలు మారాలి
X

ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వ ఏజెండానే అధికారుల ఏజెండా కావాలని..ఎవరికీ వ్యక్తిగత ఏజెండాలు ఉండకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని గ్రామాల రూపు రేఖలు మార్చాలని ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వపరంగా అవసరమైన సాయం చేస్తామన్నారు. ఖచ్చితంగా గ్రామాల రూపురేఖలు మారాలని..ఇందులో అందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. తాను వ్యక్తిగతంగా తనిఖీలకు వస్తానని కెసీఆర్ తెలిపారు. మంగళవారం నాడు ప్రగతి భవన్ లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో కెసీఆర్ పలు అంశాలపై సూచనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలను అమలు చేయడమే జిల్లా అధికార యంత్రాంగం ప్రాధాన్యం అయి ఉండాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంభిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలి. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలి. సంక్షేమరంగంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచింది.

రూ.4 వేల కోట్లతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తీవ్రమైన విద్యుత్‌ సంక్షోభం ఉండేది. చాలా తక్కువ సమయంలోనే విద్యుత్‌ సమస్యలు అధిగమించాం. దేశంలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం. మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. గతంలో వేసవి వచ్చిందంటే ప్రజలు మంచినీటికి అవస్థలు పడేవారు. మంత్రులు, కలెక్టర్ల ముందు బిందెల ప్రదర్శనలు చేసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. అన్ని గ్రామాలకు మంచినీరు అందిస్తున్నాం. రాష్ట్రస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వహించాలి. పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే కల్యాణలక్ష్మీ, కేసీఆర్‌ కిట్స్‌, కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు ఎంతో మేధో మథనం చేసి ప్రజల అవసరాలకు అనుగూణంగా ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందిస్తోంది. అలాంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో కలెక్టర్లు అమలు చేయాలి. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు చైర్మన్‌గా వ్యవహింరించేవారు. ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మార్చినం. దీనివల్ల కొంత పని ఒత్తిడి తగ్గుతుంది. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడమే లక్ష్యంగా రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది.

పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగించాలి. పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచి సంరక్షించాలి. గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలి. పాడుబడిన పాత బావులను పూడ్చివేయాలి. ఈ పనులన్నీ గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు నిర్వహించాలి. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుతో పాలనా విభాగాలు చిన్నవి అయ్యాయి. ఇది పల్లెలను పనిచేయడానికి ఎంతో సానుకూల అంశం. పల్లెల అభివృద్ధికి నిధుల కొరత సమస్య రాకుండా ప్రతీ నెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నాం. వేరే ఖర్చులు ఆపి గ్రామాలకు నిధులు ఇస్తున్నాం. రాబోయే 15 రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించాలి. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎపీపీలు, జడ్పీటీసీలను ఆహ్వానించాలి. గ్రామాలను అభివృద్ధి చేసుకునే పద్ధతి వివరించాలి. ఎవరి బాధ్యత ఏమిటో విడమరచి చెప్పాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్లను ముఖ్య అతిథులుగా పిలవాలి. సమావేశం తర్వాత పదిరోజుల గడువు ఇవ్వాలి. ఆలోగా గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పాలి. 25 రోజుల్లో గ్రామాల పరిస్థితుల్లో మార్పు రావాలి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

Next Story
Share it