విజయవాడలో జనసేన కార్యకర్తల ధర్నా..ఉద్రిక్తత

ఏపీలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు మంగళవారం నాడు విజయవాడలో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన నేతలు, కార్యకర్తలు మంగళవారం విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. బెంజ్ సర్కిల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ చేస్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
తమ నేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి జోగి రమేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. జోగి రమేష్ ఒక జోకర్ అంటూ జనసేన నేతలు ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మెప్పు, మంత్రి పదవి కోసం రమేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. నాలుక, తోక కత్తిరిస్తామని అన్నారు. అవసరమైతే భౌతిక దాడులు చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు.