Telugu Gateway
Andhra Pradesh

జీఎంఆర్ కోసం రివర్స్ కే ‘రివర్స్ గేర్ వేసిన జగన్’!

జీఎంఆర్  కోసం రివర్స్ కే ‘రివర్స్ గేర్ వేసిన జగన్’!
X

అన్నింటికి ‘రివర్స్ టెండర్లు’

భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టుపై మాత్రం చర్చలా?

ఇక్కడ మాత్రం ‘రివర్స్ టెండరింగ్’కు రివర్స్ గేర్ వేసింది ఎవరు?

గత ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాజెక్టుల్లోనూ అంచనాలు పెంచి అడ్డగోలుగా దోచుకున్నారు. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకుని మంత్రుల వరకూ చెప్పే మాటలు. ‘రివర్స్ టెండరింగ్’తో తాము వేల కోట్ల రూపాయలు ఆదా చేశామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు పెద్దలు ‘జీఎంఆర్’ దగ్గరకు వచ్చేసరికి మాత్రం రివర్స్ కు బదులు ‘చర్చల’కు ఎందుకు మొగ్గుచూపారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ కూడా పలు విమర్శలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం జీఎంఆర్ విషయంలో వైఖరి మార్చుకోవటటం వెనక మతలబు ఏమిటి?. అన్నింటికి రివర్స్ టెండరింగ్ వెళ్లి ప్రజాధనం ఆదా చేస్తామని చెప్పేన జగన్ సర్కారు జీఎంఆర్ దక్కించుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు విషయంలో మాత్రం తన నిర్ణయాలకు తానే ‘రివర్స్ గేర్’ ఎందుకు వేసుకుంది.

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు కావస్తోంది. నిజంగా సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమయంలోనే కొత్తగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి టెండర్లు పిలిచి..ఖరారు చేసే ప్రక్రియను కూడా పూర్తి చేసే అవకాశం ఉండేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు చెబుతున్నారు. యూజర్ డెవలప్ మెంట్ ఫీజు (యూడీఎఫ్) కింద వచ్చే నిధుల్లో సర్కారుకు వాటా ఇస్తామనే నిబంధన కింద టెండర్లు పిలవటమే లోపభూయిష్టం అని..ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యమైన మోడల్ కాదని ఆర్ధిక శాఖతో సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ ఇదేమీ పట్టించుకోకుండా జగన్ సర్కారు జీఎంఆర్ సంస్థతో ‘చర్చలు’ జరిపి అంగీకారానికి రావటం అంటే ఇందులో ఏదో గోల్ మాల్ ఉందనే విషయం స్పష్టం అవుతుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు విషయంలోనే ఎన్ని విమర్శలు వచ్చినా రివర్స్ టెండరింగ్ వెళ్ళిన సర్కారు...ఒకట్రెండు నెలలు ఆలశ్యం అయినా పెద్దగా తేడాపడని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవటం వెనక ఖచ్చితంగా లాలూచీ వ్యవహారాలే కారణం అని చెబుతున్నారు. మొదటి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో సర్కారు ఇదే వైఖరితో ఉంది. మూడు నెలల క్రితం కూడా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఓ ఇంటర్వ్యూలో జీఎంఆర్ కే ప్రాజెక్టు ఇస్తామని ప్రకటించారు. మరి చర్చలు ఈ మధ్య జరిగితే అప్పుడే మంత్రి ఎలా చెప్పినట్లు?. ఇది అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని...కొన్ని కంపెనీలతో చంద్రబాబు అంటకాగారని విమర్శించిన వారు కూడా ఇప్పుడు అదే పనిచేస్తున్నారని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.

Next Story
Share it