జగన్ వల్లే ఏపీకి ఈ పరిస్థితి
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి రిక్తహస్తంపై ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ స్పందించింది. ఈ పరిస్థితికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణం అని ఆ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ మేరకు ఆక్ష్న ప్రకటన విడుదల చేశారు. ‘సీఎం జగన్ తుగ్లక్ చర్యల వల్లే కేంద్రబడ్జెట్ లో ఏపికి నిధులు కేటాయించలేదు. వైసిపి అవినీతి, అసమర్ధ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఘోర వైఫల్యం. కేంద్ర నిధులు రాబట్టే సామర్ధ్యం సీఎం జగన్ లో కొరవడింది. రాష్ట్రంలో గత 8నెలల్లో అభివృద్ది పనులన్నీ ఆపేశారు. పోలవరం సహా, ప్రాజెక్టుల పనులన్నీ నిలిపేశారు. రాజధానికి నిధులు వద్దని ప్రధానికి ఇచ్చిన తొలి వినతిలో జగన్ చెప్పారు. ఎనిమిది నెలల్లోనే జగన్ లక్షల కోట్ల పెట్టుబడులు పోగొట్టారు. 3రాజధానుల నిర్ణయం ఇప్పుడు ఇంకో తుగ్లక్ చర్య. వైసిపి ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్లే ఏపికి అప్రదిష్ట. అన్నివర్గాల ప్రజలను రోడ్డెక్కించారు, రాష్ట్రాన్ని గందరగోళంలో ముంచారు.
అసమర్ధ పాలనవల్లే రాష్ట్రం నష్టపోతోంది. 25మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచుతా, నిధులు తెస్తానని గొప్పలు చెప్పారు. రెండు కేంద్ర బడ్జెట్ లలో రాష్ట్రానికి సాధించింది శూన్యం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పడగొట్టేశారు. 8నెలల్లోనే రూ 40వేల కోట్ల అప్పులు చేశారు. ఆర్టీసి ఛార్జీల పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. పేదల కొనుగోలు శక్తి, పొదుపు శక్తిని దెబ్బతీశారు. కేంద్రాన్ని మెప్పించి నిధులు రాబట్టడంలో ఘోరంగా విఫలం చెందారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాల వల్లే కేంద్ర బడ్జెట్ లో రిక్తహస్తం. విభజన చట్టం ప్రకారం నిధులు కూడా తెచ్చుకోలేక పోయారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సంజాయిషీ ఇవ్వాలి’ అని యనమల డిమాండ్ చేశారు.