Telugu Gateway
Andhra Pradesh

జగన్ సర్కారులో మాటలే తప్ప చేతల్లేవ్!

జగన్ సర్కారులో మాటలే తప్ప చేతల్లేవ్!
X

విద్యుత్ ఒప్పందాల నష్టం 2636 కోట్ల రికవరికి చర్యలెక్కడ?

జగన్మోహన్ రెడ్డి సర్కారు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. చర్యలు మాత్రం శూన్యం అనే చెప్పాలి. అవినీతిని ఏ మాత్రం సహించేదిలేదంటూ స్వయంగా తాము ప్రతిపక్షంలో ఉండగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన మెగా ఇంజనీరింగ్ సంస్థకు పోలవరం ప్రాజెక్టు పనులు కట్టబెట్టారు. ఆ సంస్థ చేపట్టిన పట్టిసీమలో భారీ అవినీతి జరిగిందని స్వయంగా జగన్, ఇప్పటి ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కాగ్ కూడా ఈ విషయాలను బహిర్గతం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి సర్కారు చాలా కన్వీనెంట్ గా పట్టిసీమ అవినీతి సంగతి మర్చిపోయి..అత్యంత కీలకమైన పోలవరం పనులను సింగిల్ టెండరే వచ్చిన మెగాకు అప్పగించేసింది. ఇదొక్కటే కాదు..విద్యుత్ ప్రాజెక్టుల విషయంలోనూ అదే తీరు. సరిగ్గా గత ఏడాది జూన్ 26న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.

ఇందులో చాలా సీరియస్ ఆదేశాలే జారీ చేశారు. చంద్రబాబునాయుడి హయాంలో జరిగిన సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ప్రకటించారు. అంతే కాదు ఈ ఒప్పందాలు వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టం 2636 కోట్ల రూపాయలను దీనికి కారణమైన ముఖ్యమంత్రి, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి, అధికారులతోపాటు కంపెనీల నుంచి రికవరీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతే కాదు చంద్రబాబునాయుడు, మంత్రులపై న్యాయమైన చర్యలూ తీసుకోవాలన్నారు. ఇది జరిగి దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్నా ఈ మొత్తం రికవరీకి చర్యలు కానీ..ఈ ఒప్పందాలకు కారణమైన అధికారులపై చర్యలు కానీ శూన్యం.

ఈ దిశగా పెద్దగా ఎలాంటి ముందడుగు పడలేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్ లో నూ ఎలాంటి పురోగతి ఉంటుందనేది అనుమానమే అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు ప్రకటించినట్లుగా నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒప్పందాలు రద్దు చేయటంతోనే సమస్య పరిష్కారం కాదని..అందుకు బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అంతే కాదు గతంలో విద్యుత్ శాఖలో చక్రం తిప్పిన ఇద్దరు అధికారుల్లో ఒకరు తిరిగి మళ్ళీ అదే శాఖలోకి రాబోతున్నట్లు ఆ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందనేది కొంత కాలం పొతే కానీ తెలియదు.

Next Story
Share it