Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ నేతల గుండెల్లో ‘ఐటి బాంబు’..2000 కోట్ల లెక్క తేలని ఆదాయం

టీడీపీ నేతల గుండెల్లో ‘ఐటి బాంబు’..2000 కోట్ల లెక్క తేలని ఆదాయం
X

అధికారికంగా వెల్లడించిన ఐటి శాఖ

ఏపీలోని ప్రతిపక్ష టీడీపీకి కష్టాలు మరింత పెరిగేలా ఉన్నాయి. ఓ వైపు రాజకీయ సమస్యలకు తోడు ఇప్పుడు ఐటి చిక్కు కూడా వచ్చి పడింది. ఏకంగా ఐటి శాఖ తాజాగా జరిపిన దాడుల్లో 2000 కోట్ల రూపాయల మేర లెక్క తేలని ఆదాయాన్ని గుర్తించినట్లు ప్రకటించింది. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ నివాసంలో ఐదు రోజుల పాటు ఐటి శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటి అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పూణేల్లోనని 40 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో 2000 కోట్ల మేర లెక్క చూపని ఆదాయానికి సంబంధించిన రికార్డులను గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన మూడు ప్రముఖ మౌలికసదుపాయాల కంపెనీలు కూడా ఉన్నాయి.

ఇందులో భారీ రాకెట్ బహిర్గతం అయిందని ఐటి శాఖ వెల్లడించింది. బోగస్ సబ్ కాంట్రాక్టర్లు, ఓవర్ ఇన్వాయిసింగ్, బోగస్ బిల్లుల ద్వారా భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిపారు. ఐటి శాఖ తనిఖీల్లో దీనికి సంబంధించిన సాక్ష్యాలుగా పలు డాక్యుమెంట్లు, ఈ మెయిళ్ళు, వాట్సప్ మెసేజ్ లను గుర్తించారు. దీంతోపాటు విదేశీ లావాదేవీలు కూడా బహిర్గతం అయ్యాయి. మౌలికసదుపాయాల కంపెనీలు అసలు ఉనికిలోని బోగస్ కంపెనీల పేరిట సబ్ కాంట్రాక్ట్ లు ఇచ్చి ఏకంగా 2000 కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు గుర్తించారు. ఈ కంపెనీలు అన్నీ కూడా 2 కోట్ల రూపాయల లోపు టర్నోవర్ కలవే. అకౌంట్ బుక్స్ నిర్వహణ, ట్యాక్స్ ఆడిట్ వంటి వాటిని తప్పించుకునేందుకు ఈ ఎత్తుగడ వేశారు.

ఆయా కంపెనీలు ఏవీ రిజిస్టర్ ఆఫీసుల అడ్రస్ ల్లో లేవు. అయితే ఏ కంపెనీ అయితే సబ్ కాంట్రాక్ట్ లు ఇచ్చిందే అదే కంపెనీ ప్రధాన కార్పొరేట్ కార్యాలయం నుంచి వీటి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఈ వివరాలను గుర్తించారు. ఓ నిర్మాణ సంస్థకు చెందిన గ్రూప్ సంస్థలకు వచ్చిన విదేశీ నిధుల వెనక గోల్ మాల్ ఉందని ఐటి శాఖ గుర్తించింది. ఈ దాడుల్లో లెక్కతేలని 85 లక్షల రూపాయల నగదు, 71 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 25కి పైగా లాకర్లను స్వాధీనంలోకి తీసుకున్నారు.

Next Story
Share it