Telugu Gateway
Andhra Pradesh

వైజాగ్ లో జగన్ ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తారు?

వైజాగ్ లో జగన్ ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తారు?
X

అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ను విమర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఇదే పని ఎలా చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. జగన్ సర్కారుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చేశారని మండిపడ్డారు. డిక్టేటర్స్ లా చేస్తామంటే నడవదు..ఇది ప్రజాస్వామ్యం అని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం చేస్తే ఈ రోజు కాకపోయినా రేపు అయినా శిక్ష తప్పదన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తించుకోవాలన్నారు. మూడు రాజధానుల వల్ల ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయని..ఉధ్యోగులకు కూడా వేతనాలు మరింత పెంచాల్సి వస్తుందని అన్నారు. అమరావతిలో పది వేల ఎకరాల భూమితో రెండు లక్షల కోట్ల రూపాయల సంపద వచ్చేదన్నారు. అమరావతి రైతులపై మీకెందుకు ఇంత కక్ష అని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖ, కర్నూలులో అభివృద్ధి చేయటాన్ని ఎవరూ ఆక్షేపించరన్నారు. జగన్ వచ్చాక రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు వెనక్కి పోయాయని అన్నారు. తిరుపతిలో యూనిట్‌ పెడతామని వచ్చిన రిలయన్స్‌ కంపెనీని జగన్ ప్రభుత్వం వెనక్కి పంపించిందని ఆరోపించారు.

సోమవారం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతపురానికి కియా కంపెనీ తీసుకొస్తే.. అక్కడ రైతుల్ని వైసీపీ నేతలు రెచ్చగొట్టారని చంద్రబాబు ఆరోపించారు. వరల్డ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ బ్యాంకులు వెనక్కి పోయాయన్నారు. నంద్యాలను ప్రపంచ విత్తన రాజధానిగా చేసేందుకు ఒప్పందం చేసుకున్నామని, అలాంటి ప్రాజెక్టులన్నీ రాకుండా చేస్తున్నారని విమర్శించారు. ఎంత సేపూ వివాదాలు, తగవులు, ప్రత్యర్థుల్ని దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. మూడు రాజధానులు పెట్టడానికి సీఎంకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. మూడు రాజధానులు అని రాజ్యాంగంలో ఉందా? అని నిలదీశారు. కర్నూలును రాజధానిగా చేస్తే సపోర్ట్‌ చేస్తామని చెప్పామన్నారు. తమపై కావాలనే బురదజల్లుతున్నారని, ఉత్తరాంధ్ర ద్రోహి జగనే అని చంద్రబాబు పేర్కొన్నారు.

కర్నూలులో అనేక ప్రాజెక్ట్‌ లకు టెండర్లు పిలిచామని, ఆ ప్రాజెక్ట్‌ లను ఎందుకు రద్దు చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇరిగేషన్‌పై ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. కార్యాలయాలను విశాఖకు తరలించవద్దని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను బాపట్లకు బదిలీ చేశారని విమర్శించారు. సీఎస్‌ స్థాయి వ్యక్తిపై ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. పీపీఏల విషయంలో అజేయ కల్లం, రమేష్‌ కలిసి తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చారని ఆరోపించారు. అజేయ కల్లం ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. అంతగా ఆనందం ఉంటే అజయ్ కల్లాం వైసీపీలో చేరి ఎంపీగానో..ఎమ్మెల్యేగానో పోటీచేయాలన్నారు.

Next Story
Share it