Telugu Gateway
Andhra Pradesh

చరిత్రలో తొలిసారి..మండలి కార్యదర్శిపై ఛైర్మన్ ఫిర్యాదు

చరిత్రలో తొలిసారి..మండలి కార్యదర్శిపై ఛైర్మన్ ఫిర్యాదు
X

కొత్త మలుపు తిరిగిన ‘మండలి వ్యవహారం’

బహుశా ఇది చరిత్రలో మొదటి సారి అయి ఉండొచ్చు. ఓ శాసనమండలి ఛైర్మన్ మండలిలో పనిచేసే కార్యదర్శిని సస్పెండ్ చేయమని రాష్ట్ర గవర్నర్ ను కోరటం. మండలి కార్యదర్శి అనేది అత్యంత కీలకమైన పోస్ట్. ఏపీలో రాజధానుల వికేంద్రీకరణ బిల్లు వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ ఇక్కడి వరకూ వచ్చింది. కౌన్సిల్ ఛైర్మన్ ఎం ఎ షరీఫ్ తన విశేషాధికారాలను ఉపయోగించి అసెంబ్లీలో ఆమోదం పొందిన రాజధానుల వికేంద్రీకరణతోపాటు సీఆర్ డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించటంతో అసలు వివాదం మొదలైంది.ఈ ప్రకటన నిబంధనలు, పద్దతుల ప్రకారం సాగలేదని..అందుకే తాను తదుపరి ఆదేశాలు ఇవ్వలేనంటూ మండలి ఇన్ ఛార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు నిరాకరించారు. దీనిపై అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నాయి. తాజాగా ఈ వివాదం ఏకంగా గవర్నర్ వద్దకు పోయింది. మరి ఆయన దీనిపై చర్య తీసుకునే అవకాశం ఉందా?. లేక మండలి కార్యదర్శి నుంచి వివరణ కోరతారా?. ఏమి జరుగుతుందో వేచిచూడాల్సిందే. కార్యదర్శి తన ఆదేశాలను ధిక్కరించడంతో శాసనమండలి చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ మంగళవారం నాడు రాజ్‌భవన్‌ తలుపులు తట్టారు.

రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నారని.. తనకు సహకరించకపోగా ప్రభుత్వానికి... మండలికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడానికి కారకులయ్యారని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మండలికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఇన్‌చార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. ఆ స్థానంలో విజయరాజును నియమించాలని విజ్ఞప్తి చేశారు. తన ఆదేశాలను పాటించడానికి రెండుసార్లు మండలి కార్యదర్శి నిరాకరించడంతో తప్పని పరిస్థితుల్లోనే గవర్నర్‌ను చైర్మన్‌ కలిశారని చెబుతున్నారు. విజయరాజు గతంలో టీడీపీ హయాంలో అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేశారు. వైసీపీ ప్రభు త్వం వచ్చాక ఆయన్ను మార్చి బాలకృష్ణమాచార్యులిని ఆ స్థానంలో పెట్టారు.

Next Story
Share it