Telugu Gateway
Andhra Pradesh

అచ్చెన్నాయుడు బుక్ అయినట్లేనా?!

అచ్చెన్నాయుడు బుక్ అయినట్లేనా?!
X

టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుక్ అయినట్లేనా?. అంటే ఔననే చెబుతోంది వైసీపీ సర్కారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చెన్నాయుడు రాసిన లేఖను కూడా వైసీపీ బహిర్గతం చేసింది. అంతే కాదు. టెలిహెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీకి తెలంగాణలో కుదిరిన ఒప్పందం తరహాలో ఏపీలో కూడా ప్రాజెక్టు అప్పగించాలని కోరుతూ అచ్చెన్నాయుడు ఏకంగా ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ నివేదికలో ఏపీ ఈఎస్ఐలో భారీ అక్రమాలు జరిగినట్లు నిగ్గుతేల్చారు. 2014-19 సంవత్సరాల కాలంలో జరిగిన 975 కోట్ల రూపాయల లావాదేవీల్లో 70 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు తేల్చారు. ముగ్గురు డైరక్టర్ల పదవీ కాలంలో ఈ లావాదేవీలు జరిగాయని తేల్చారు. రాష్ట్రంలోని నాలుగు ఈఎస్ఐ ఆస్పత్రులు, మూడు డయాగ్నోస్టిక్ సెంటర్లు, 78 ఈఎస్ఐ డిస్పెన్సరీలకు ఔషధాలు, పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని నిర్ధారించారు.

ఈ ఆరోపణలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. కావాలనే కొంత మంది తనపై దుష్ప్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని సూచనల మేరకే అప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రస్తుత ఏపీ కార్మిక శాఖ మంత్రి జీ. జయరాం స్పందించారు. అవినీతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇవి జరిగాయన్నారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరి చేస్తామని తెలిపారు.ఈ స్కామ్ తో సంబంధం ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడితోపాటు అధికారులనుకూడా వదిలిపెట్టబోమన్నారు.

Next Story
Share it