Telugu Gateway
Politics

భారతీయ ‘ఆత్మ’ను టచ్ చేసిన డొనాల్డ్ ట్రంప్

భారతీయ ‘ఆత్మ’ను టచ్ చేసిన డొనాల్డ్ ట్రంప్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కా వ్యూహం ప్రకారమే సాగుతున్నట్లు కన్పిస్తోంది. సోమవారం నాడు అహ్మదాబాద్ లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంతో మొతెరా స్టేడియం మోతెక్కింది. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని చూస్తే ఆయన భారతీయ ‘ఆత్మ’ను టచ్ చేసే ప్రయత్నం చేయటం ద్వారా దేశ ప్రజల మనసు చూరగొనే ప్రయత్నం చేశారు. అది ఆయనకు ఎప్పుడు..ఎక్కడ లబ్ది చేకూర్చాలో అక్కడ లబ్ది చేకూర్చనుంది. అంతే కాదు..ప్రధాని నరేంద్రమోడీపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ట్రంప్ ముఖ్యంగా క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కొహ్లి పేర్లను ప్రస్తావించటంతోపాటు బాలీవుడ్, సినిమాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని పలు మతాల ప్రజల పక్కనే కలసి ఉండటం ఎంతో గొప్ప విషయం అంటూ భిన్నత్వంలో ఏకత్వం అంశాన్ని కూడా ప్రస్తావించారు. పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను విమర్శిస్తూనే..తాము ఆ దేశంతో స్నేహం చేస్తూ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొనటం విశేషం. అంతరిక్ష పరిశోధనల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రయాన్ 2పై ప్రశంసలు కురిపిస్తూ అంతరిక్ష రంగంలో భారత్, అమెరికా కలసి పనిచేస్తున్నాయని తెలిపారు. అంతే కాదు..భారతీయులకు ఎంతో కీలకమైన దీపావళి, హోలీ పండగలను ప్రస్తావించటం ద్వారా ట్రంప్ భారీ కసరత్తే చేసినట్లు కన్పిస్తోంది. మొతెరా స్టేడియంలో నమస్తే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్‌ దేశం కోసం మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనిడాయారు.

భారత్‌- అమెరికాలు 3 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని ప్రకటించారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని అంటూ అమెరికా భారత్‌ను అభిమానిస్తుందని అన్నారు. భారత్‌, అమెరికా ఎప్పటికీ నమ్మదగ్గ స్నేహితులు..లక్ష మందికి పైగా ఇక్కడికి రావడం ముదావహం. భారత్‌ ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరిచిపోలేం..ఈ పర్యటన మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిఉంటుంది. ఓ ఛాయ్‌ వాలా స్ధాయి నుంచి మోదీ ప్రధానిగా ఎదిగిన తీరు అద్భుతం..ఇంతటి విశాల దేశాన్ని మోదీ అద్భుతంగా నడిపిస్తున్నారు. అత్యంత విజయవంతమైన ప్రధానుల్లో మోదీ ఒకరు. భారతీయులు ఏదైనా సాదించగలరనేందుకు మోదీ నిదర్శనం. భారత్‌ ఆర్థిక ప్రబల శక్తిగా ఎదిగింది. దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 12 కోట్ల మందికి పైగా ప్రజలు ఇంటర్‌నెట్‌ వాడుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఎంతో పురోగతి సాధించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ స్ధాయిలో మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. భవిష్యత్‌లో భారత్‌ అద్భుత శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. ఈ దశాబ్ధంలో భారత్‌ అత్యధిక విజయాలు సాధించింది. ఈ భారీ ప్రజాస్వామ్య దేశాన్ని ప్రధాని మోదీ శాంతియుతంగా ముందుకు తీసుకువెళుతున్నారు.

Next Story
Share it