Telugu Gateway
Andhra Pradesh

ఆ బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లవు!

ఆ బిల్లులు  సెలక్ట్ కమిటీకి వెళ్లవు!
X

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్ళవని ఏపీ ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అసలు తాము కమిటీకి ఎలాంటి పేర్లు ఇవ్వడంలేదని ఆయన స్పష్టం చేశారు. మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి రిఫర్ చేయలేదన్నారు. నిబంధనల ప్రకారం అవి సెలక్ట్ కమిటీకి పంపలేదన్నారు. ప్రభుత్వం మొదటి నుంచే ఇదే వాదన విన్పిస్తోంది. గతంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అధికారులు నిబంధనల ప్రకారమే చేస్తారు కానీ..తాము మంత్రులు అయినంత మాత్రాన ఏది చెపితే అది చేయరన్నారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే బొత్స గతంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు తాజాగా ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా నిబంధనల ప్రకారం లేనందున అవి సెలక్ట్ కమిటీకి వెళ్ళే అవకాశం లేదని తెలిపారు. ఇఫ్పటికే ప్రతిపక్ష టీడీపీ, బిజెపి, మండలిలోని ఇతర సభ్యులు తమ పేర్లను సెలక్ట్ కమిటీ కోసం అని పంపారు. కానీ ఇప్పుడు అసలు సెలక్ట్ కమిటీ ఏర్పాటే జరిగే ఛాన్స్ కన్పించటం లేదు. మరి తాజా పరిణామాలపై ప్రతిపక్ష టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. అసలు ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించాలని మండలిలో నిర్ణయించినందునే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకంగా మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it