Telugu Gateway
Andhra Pradesh

అచ్చం చంద్రబాబులాగానే బొత్సా!

అచ్చం చంద్రబాబులాగానే బొత్సా!
X

అప్పుడు చంద్రబాబునాయుడు ఏమి చెప్పారో..అచ్చం అలాగే ఇప్పుడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు ఎందుకు ఎన్డీయే కేబినెట్ లో ఉంటున్నారు...రాష్ట్ర ప్రయోజనాల కోసం బయటకు రావాలని పదే పదే డిమాండ్ చేసింది. అసెంబ్లీలోపలా..బయటా ఇదే మాట చెప్పింది. అప్పుడు టీడీపీ చెప్పిన మాట ‘సఖ్యతతో ఉండి సాధిస్తాం. ఘర్షణతో ఏమి వస్తుంది’. సఖ్యతతో ఉండి ఏమి సాధించారో అందరూ చూశారు. ఇప్పుడు చంద్రబాబు తరహాలోనే బొత్స సత్యనారాయణ కూడా బిజెపి, కేంద్రంతో ఘర్షణ పడాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. అసలు ఘర్షణ పడమని చెప్పింది ఎవరు?. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం అయితే ఎన్డీయేలో చేరతామని కూడా బొత్స ప్రకటించారు.

రాష్ట్ర ప్రయోజనాలు అంటే వైసీపీకి మంత్రి పదవులా?. లేక ఏపీకి ప్రత్యేక హోదానా?. విభజన చట్టంలో ఉన్న ప్రకారం కడపకు స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు లను కేంద్రమేనిర్మించటమా?. విభజనతో ఏర్పడిన ఏపీ ఆర్ధిక లోటును భర్తీ చేయటమా?. రాజధాని కూడా లేకుండా విభజనతో సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రంలో కొత్తగా నిర్మించే రాజధాని నిర్మాణానికి పూర్తి స్థాయి నిధులు సాధించటానికా?. ఆ రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఏంటో బొత్స మరింత వివరిస్తే బాగుండేది. అంతే కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా గడ్డం పట్టుకుని బతిమిలాడే స్థాయికి కూడా దిగుతామని బొత్స ప్రకటించారు. ఎవరి నుంచి అయినా ఉచితంగా సాయం పొందాలంటేనో.లేకపోతే అనుచిత లబ్ది కోసం అయితే బతిమిలాడుకోవచ్చు..గడ్డాలు పట్టుకోవచ్చు. కానీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం గడ్డాలు పట్టుకుని బతిమాలాడుకోవాల్సిన అవసరం ఏముంది?.

ఏపీకి విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి..తెచ్చుకోవాల్సిన హక్కు రాష్ట్రానిది. ఇందులో బతిమిలాడుకోవటాలు..గడ్డాలు పట్టుకోవటాలు ఏమిటి?. ప్రతిపక్షంలో ఉండగా 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హక్కులు సాధిస్తామని చెప్పిన వైసీపీ...ఇప్పుడు బతిమాలుకుంటాం..గడ్డాలు పట్టుకుంటాం అనటం వెనక మతలబు ఏమిటి?. అధికారంలో ఉంటే ఓ మాట..ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట. అది ఏ పార్టీ అయినా ఒకటే అనే విషయం తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మరోసారి నిరూపితం అయింది.

Next Story
Share it