Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు..లోకేష్ లపై కూడా ఐటి దాడులు చేయాలి

చంద్రబాబు..లోకేష్ లపై కూడా ఐటి దాడులు చేయాలి
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై కూడా ఐటి దాడులు చేయాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ దగ్గరే వేల కోట్ల రూపాయలకు చెందిన లావాదేవీలు జరిగినట్లు తేలితే...వాళ్ళిద్దరిపై ఐటి దాడులు జరిగితే ఎంత వస్తాయో అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పీఎస్ తోపాటు కడప టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తనయుడు కంపెనీలపైనే దాడులు జరిగాయన్నారు. మరో కంపెనీ వివరాలు త్వరలోనే వస్తాయన్నారు. ఐటి సోదాలపై చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుని తిన్నారని విమర్శించారు. చంద్రబాబు చేసేవన్నీ దొంగ పనులని విమర్శించిన బొత్స.. అక్రమ లావాదేవీలపై ఆయన నోరు విప్పాలని సవాల్ విసిరారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందన్నారు. బొత్స సత్యనారాయణ శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు.

‘చంద్రబాబు, లోకేష్‌ బినామీలపై ఐటీ సోదాలు జరిగాయి. విజయవాడ, హైదరాబాద్‌ సహా ఢిల్లీ, పుణెలలో కూడా సోదాలు జరిగాయి. మొత్తం 40కి పైగా ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ భారీగా అక్రమ లావాదేవీలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచి విదేశాలకు.. అక్కడి నుంచి తిరిగి ఇండియాకు లావాదేవీలు జరిగాయని ఐటీ ప్రకటించింది. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడని మేం మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాం. రాజధాని పేరుతో టీడీపీ నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. కాంట్రాక్ట్‌ల పేరుతో రూ. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపించారు.

Next Story
Share it