Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు కుట్రలు సాగవు

చంద్రబాబు కుట్రలు సాగవు
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆయనకు ఏ మాత్రం ఇప్టం లేదని..అందుకే ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అయినా సరే ఆయన ప్రయత్నాలు ఏమీ ఫలించవన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఎప్పుడైతే అసెంబ్లీ లో పెట్టామో... అప్పటి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. తదుపరి కార్యక్రమాలన్నీ పరిపాలనలో భాగంగా జరిగేవే అన్నారు. రాజ్యాంగ పరంగానే జీవో లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కోర్టులను గౌరవిస్తూనే కార్యక్రమాలు చేపడుతున్నామని.. ఉద్యోగులకు సమస్యలు ఉంటే తమతో చర్చిస్తారని వెల్లడించారు. ‘ప్రజలందరూ రాజధాని త్వరగా తరలించాలని కోరుకుంటున్నారు. కార్యాలయం ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వం ఇష్టం. గత ప్రభుత్వం నోటి మాట తో ముందుకు వెళ్ళింది. విజిలెన్స్ కార్యాలయం విజయవాడలో ఉండాలని చట్టం లో ఉందా?.. పరిపాలన సౌలభ్యం కోసమే విజిలెన్స్ కార్యాలయం తరలిస్తున్నామని’ బొత్స పేర్కొన్నారు. బలవంతపు భూ సేకరణ చేసిన భూములు వెనక్కి ఇవ్వమని రైతులు కోరారని.. రోడ్లు కింద పోయే భూములు వేరేచోట ఇవ్వమని రైతులు అడిగారని తెలిపారు.

దీన్ని పరిశీలించమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారని మంత్రి బొత్స వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం కంటే పెన్షన్లు అదనంగానే ఇచ్చామని..7 లక్షల పింఛన్లు తొలగించామని టీడీపీ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ఆరు లక్షలకు పైగా కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేశామని.. అనర్హుల జాబితా మరోసారి పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు ఇస్తామని వివరించారు. కియా పరిశ్రమ తరలిపోతుందనే టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని మంత్రి బొత్స తప్పుపట్టారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు కొత్త డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరిగారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అబద్ధాలు చెప్పటం దారుణమని.. మిలీనియం టవర్స్‌లో ఉన్న కంపెనీలను ఖాళీ చేయమని తాము నోటిసులు ఇవ్వలేదన్నారు.

Next Story
Share it