Telugu Gateway
Andhra Pradesh

అమరావతితో ‘బిజెపి..కేంద్రం ఆటలు’!

అమరావతితో ‘బిజెపి..కేంద్రం ఆటలు’!
X

‘క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్’ మినహాయింపు ఇచ్చిన కేంద్రం

ఒక్క అమరావతితోనే ఏంటి?. ఏపీతోనే బిజెపి ఆటలు ఆడుకుంటోంది. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా విషయం మొదలుకుని ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే వైఖరి. రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే. అందరు చెప్పే మాట ఇదే. ఈ విషయంలో పెద్దగా విభేదించటానికి ఏమీ లేదు. కానీ ఏపీ నూతన రాజధాని అమరావతి కోసం కేంద్రం భవన నిర్మాణాల కోసం 1500 కోట్ల రూపాయలు, విజయవాడ, గుంటూరుల్లో పట్టణ మౌలికసదుపాయాల కల్పనకు 1000 కోట్ల రూపాయలు కేటాయించింది. అప్పటి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించారు కాబట్టి కేంద్రం ఇచ్చింది. అంత వరకూ ఓకే. కానీ అమరావతి కోసం భూములు ఇఛ్చిన రైతులకు కేంద్రం క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపులు ఇఛ్చింది. మరి ఈ మినహాయింపులు ఎందుకు ఇచ్చినట్లు?. అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అప్పటి ఏపీ ప్రభుత్వం కోరిక మేరకు రైతులకు అనుకూలంగా ఈ నిర్ణయం ప్రకటించారు.

ఈ మొత్తం మినహాయింపు 700 నుంచి 900 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనాలు వేశారు. రాజధానికి భూములు ఇచ్చినందుకు గాను రైతులకు ఇచ్చే కమర్షియల్ ప్లాట్స్ అమ్ముకున్న వారికి ఒక్కసారికి (ఫస్ట్ లావాదేవీ) ఎలాంటి పన్ను వసూలు చేయరు. 2017 ఫిబ్రవరి 2న ఈ మినహాయింపు ప్రకటన చేశారు. రెండేళ్ళ పాటు ఈ మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కొంత మంది రైతులు ప్లాట్స్ అమ్ముకున్నారు..క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రాయితీలను కూడా పొందారు. ప్లాట్స్ అమ్ముకున్న వారి సంఖ్య 20 నుంచి 30 శాతం వరకూ ఉంటుందని అనధికారిక సమాచారం. కేంద్రం రాజధాని కోసం అన్నీ కలుపుకుని ఇప్పటికే 2500 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు కూడా ఇఛ్చింది. అయినా రాష్ట్ర రాజధాని విషయంలో మేం ఎలా జోక్యం చేసుకుంటాం అంటూ ఎదురుప్రశ్న వేస్తోంది బిజెపి, కేంద్రం. ఇప్పటికే చంద్రబాబు అమరావతిపై సుమారు 7000 కోట్ల రూపాయల వరకూ నిర్మాణాలపై ఖర్చు చేశారు. కేంద్రం కూడా కొంత సాయం చేసింది. అయినా సరే ఏపీ ప్రభుత్వానికి కనీసం సూచన కూడా చేయటానికి కేంద్రం ఇష్టపడటం లేదంటే ఇందులో ‘రాజకీయ కోణాలు’ ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఏపీ బిజెపి మాత్రం కేంద్రం జోక్యం చేసుకోదు..మేం మాత్రం రాజకీయ పోరాటం చేస్తామని ప్రకటిస్తే ప్రజలు ఈ మాటలను నమ్ముతారా?.

Next Story
Share it