Telugu Gateway
Cinema

‘భీష్మ’మూవీ రివ్యూ

‘భీష్మ’మూవీ రివ్యూ
X

నితిన్ ఈ సారి చాలా గ్యాప్ తీసుకున్నాడు. శ్రీనివాస కళ్యాణం తర్వాత ఈ హీరో చేసిన సినిమానే ‘భీష్మ’. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు అన్నట్లు ఓ వినూత్నమైన కథను తీసుకుని ఏ మాత్రం బోర్ కొట్టకుండా భీష్మ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వెంకీ కుడుముల. సినిమాల విషయానికి వచ్చేసరికి వ్యవసాయ సబ్జెక్ట్ అంటే సహజంగానే కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉంటాయి. కానీ దర్శకుడు వెంకీ కుడుముల తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పటంతో పాటు ఎక్కడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేయటంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందనల కెమిస్ట్రీ సూపర్ వర్కవుట్ అయింది. ఈ సినిమాతో హిట్ కొట్టడంతో ద్వారా రష్మిక టాలీవుడ్ లో తనకు ఇఫ్పట్లో తిరుగులేదని నిరూపించుకుంది. హీరో నితిన్ కూడా కామెడీ సన్నివేశాలను కూల్ గా చేస్తూ ప్రేక్షకులను నవ్వించటంలో సక్సెస్ అయ్యారు. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే ఆర్గానిక్ వ్యవసాయం వర్సెస్ కెమికల్స్ తో కూడిన వ్యవసాయం. క్రికెట్ లో టెస్ట్ లు..వన్డేలు పోయి ట్వంటీ ట్వంటీ వచ్చినట్లు వ్యవసాయంలో అతి తక్కువ సమయంలో అధిక దిగుబడి సాధించాలనేది ఒకరి ఆలోచన.

భూమి దెబ్బతినకుండా..భూమిలోకి రసాయనాలు పోకుండా సహజసిద్ధమైన వ్యవసాయం చేయాలనేది ‘భీష్మ ఆర్గానిక్’ ఆలోచన. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ఎత్తులు వేయటం..ఆ ఎత్తులను భీష్మ ఆర్గానిక్ తరపున హీరో నితిన్ చిత్తు చేయటం చుట్టూనే సినిమా సాగుతుంది. అయితే ఈ సీరియస్ సబ్జెక్ట్ వైపు ఎక్కువ నడిపించకుండా దర్శకుడు హీరో నితిన్, వెన్నెల కిషోర్ , సంపత్ రాజ్ ల కామెడీ సన్నివేశాలు పాత్రలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. అసలు భీష్మ ఆర్గానిక్ కు నితిన్ కు సంబంధం ఏంటి?. డిగ్రీ డ్రాప్ ఔట్ అయిన హీరో ఓ కంపెనీకి సీఈవో ఎలా అవుతాడు అన్నది వెండితెరపై చూడాల్సిందే. భీష్మ ఆర్గానిక్ వ్యవస్థాపకుడిగా నటించిన అనంత్ నాగ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సినిమాలో పాటలు ఓ మోస్తరుగానే ఉన్నాయి. క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ లో రష్మిక స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా చూస్తే ‘భీష్మ’ శివరాత్రికి వచ్చిన సరదాల సినిమా.

రేటింగ్.3/5

Next Story
Share it