నా మనుషుల కోసం ఎక్కడా తప్పు చేయలేదు

‘ నా జీవితం తెరిచిన పుస్తకం. నీతి, నిజాయతీతో ఉన్నా. ఒక పద్దతి ప్రకారం రాజకీయం చేశా. నా కుటుంబం కోసం, నా మనుషుల కోసం ఎక్కడా తప్పు చేయలేదు. డబ్బుకు లొంగి, కేసులకు భయపడితే ప్రజలకు భవిష్యత్ ఉండదు. తెలుగుదేశం నేతల భధ్రతను తొలగిస్తున్నారు. నా భద్రత తొలగించినా ఇబ్బంది లేదు. నన్ను ప్రజలే కాపాడుకుంటారు’ అంటూ తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఆయన రోడ్డెక్కారు. ప్రకాశం జిల్లా నుంచి బుధవారం నాడు ఈ యాత్ర ప్రారంభం అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. దోపిడీ చేసుకోడానికి వైసీపీ దొంగలకు భద్రత పెంచారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే.. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ 9 నెలల పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని చంద్రబాబు అన్నారు. పరిపాలన ఇలాగే ఉంటే పిల్లల భవిష్యత్ ఏమౌతుందని ప్రశ్నించారు. ఇది రద్దుల ప్రభుత్వం.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. సీఎం జగన్ అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపుకొట్టారన్నారు.
పేదవాళ్లు తిండి తినడం కూడా ముఖ్యమంత్రికి ఇష్టంలేదన్నారు. జగన్.. మూడు ముక్కలాట ఆడుతున్నారని, ఏపీకి మూడు రాజధానులు అని చెప్తే నవ్వుతారని చంద్రబాబు అన్నారు. అమరావతిపై జగన్ కు ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ‘‘అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని ప్రచారం చేశారు. ఎక్కడో నందిగామ, నూజివీడులో భూములు కొంటే.. అది కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్ అవుతుందంట. వైసీపీ ప్రభుత్వానికి విశాఖపై ప్రేమ లేదు. విశాఖలో ఉన్న పరిశ్రమల్ని వెళ్లగొట్టారు. ఇష్టానుసారం సిమెంట్, పెట్రోల్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. తప్పు చేస్తే ఎప్పటికైనా ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. కేసీఆర్‌తో కలిసి జగన్ ఏపీ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాడని విమర్శించారు.