Telugu Gateway
Andhra Pradesh

కేంద్రంపై నోరెత్తలేని స్థితిలో ఏపీ పార్టీలు!

కేంద్రంపై నోరెత్తలేని స్థితిలో ఏపీ పార్టీలు!
X

పరస్పర విమర్శలతో వైసీపీ, టీడీపీ బడ్జెట్ ‘రాజకీయం’

ఫ్రెండ్లీ పార్టీగా మారిన జనసేన

ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు. అసలు ఏపీలో బిజెపి ఉనికి అంతంత మాత్రమే. ఒక్క శాతం ఓటింగ్ కూడా లేని ఆ పార్టీని చూసి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వణికిపోతున్నాయని చెప్పొచ్చు. దీనికి కారణం కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండటమే. ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే కేంద్రంలోని బిజెపి సారధ్యంలో ఉన్న ప్రభుత్వంపై కానీ..బిజెపిపై ఏపీ రాజకీయ పార్టీలు ‘నోరెత్తలేని’ పరిస్థితి. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగినా కూడా వైసీపీ కేంద్రాన్ని కానీ..బిజెపిపై కానీ ఒక్కటంటే ఒక్క విమర్శ చేయలేదు. కేవలం అసంతృప్తితో..బడ్జెట్ లో అన్యాయం జరిగింది అనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు తప్ప...విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయంగా ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇవ్వకపోగా..బడ్జెట్ లో కూడా కనీసం రాష్ట్రానికి నామమాత్రంగా కూడా ‘ప్రత్యేక’ ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎవరిని ప్రశ్నించాలి. కేంద్రాన్ని..కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా కూడా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగినా పట్టించుకోవటంలేదని..చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి అని విమర్శలు చేసింది ఆ పార్టీ.

మరి ఇప్పటి ఈ పరిస్థితికి కారణం ఎవరు?. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా..కేంద్రంలో బిజెపి సర్కారు ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు ఇంచుమించు మద్దతు ప్రకటించినా కేంద్రం నుంచి దక్కింది ఏమిటి అంటే శూన్యమే అని చెప్పొచ్చు. ఇప్పుడేమో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగితే కేంద్రాన్ని ప్రశ్నించాల్సింది పోయి..మమ్మల్ని విమర్శిస్తారా?. దీనికంతటికీ కారణం చంద్రబాబే అని టీడీపీ విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుపై విమర్శలు ఓకే..కానీ అదే జోరు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బిజెపి, కేంద్రంపై మాత్రం ఉండదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అత్యంత కీలకమైన కేంద్ర బడ్జెట్ పై మాత్రం మాట మాత్రంగా అయినా మాట్లాడలేదు. బిజెపి గురించి..కేంద్రం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ ఏ సమస్య వస్తుందేమో అన్న చందంగా ఆయన మౌనంగా ఉండిపోయారు. తెలంగాణలో మాత్రం సీఎం కెసీఆర్ ఈ సారి కేంద్రాన్ని గట్టిగానే టార్గెట్ చేశారు. ఇక ఏపీలో ప్రతిపక్ష టీడీపీ బడ్జెట్ ప్రకటన వెలువడిన వెంటనే వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసింది. జగన్ వ్యవహార శైలి వల్లే ఈ పరిస్థితి అంటూ ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ పీపీఏల విషయంలో కేంద్ర నిర్ణయాలకు భిన్నంగా వెళ్ళటం, అమరావతికి డబ్బులు అక్కర్లేదని లిఖితపూర్వంగా చెప్పటం వంటి కారణాలతోనే కేంద్రం అసలు ఏపీ అంశాన్ని విస్మరించిందని విమర్శలు గుప్పించారు.

కానీ అన్యాయం చేసిన కేంద్రాన్ని కానీ..బిజెపిని కానీ ఆయన కూడా ఒక్క మాట అనలేదు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఎలా వ్యవహరించిందో..ఇప్పుడు టీడీపీ కూడా అదే బాటలో నడుస్తోంది. అంతే కానీ..రెండు పార్టీలు కలసి రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన విభజన హామీలు..నిధుల విషయంలో పోరాటం చేద్దామనే యోచన ఎవరికీ ఉన్నట్లు కన్పించటంలేదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అధికార, విపక్షాలు రెండింటికి ఉన్న మైనస్ లే రాష్ట్రం ఈ పరిస్థితిలో చిక్కుకోవటానికి కారణం అని ఆయన విశ్లేషించారు. ఇదిలా ఉంటే మరో పార్టీ జనసేన ఇప్పుడు బిజెపికి మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. సో ఆ పార్టీ కేంద్రాన్ని, బిజెపిని విమర్శించే అవకాశం లేదు. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర బడ్జెట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ..వైసీపీ సర్కారు నిర్వాకాల వల్లే ఏపీకి ఈ పరిస్థితి అంటూ విమర్శలు గుప్పించారు. ఏతా వాతా ఏపీలో ఒక్కటంటే ఒక్క రాజకీయ పార్టీ కూడా కేంద్రాన్ని, బిజెపిని గట్టిగా ప్రశ్నించే పార్టీనే లేకుండా పోయింది. మరి ఈ పరిస్థితిలో అసలు మార్పు వస్తుందనే అవకాశాలు లేవని అంటున్నారు అధికారులు.

Next Story
Share it