వైసీపీ ఎమ్మెల్యేలకు రాజధాని సెగ
ఒక్క రోజే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు అమరావతి రైతుల ఆగ్రహన్ని చవిచూశారు. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందిన వాహనంపై రాళ్ళ దాడి చేయటంతోపాటు..కర్రలతోనూ దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే భధ్రతా సిబ్బందిపై దాడులకు దిగారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని ఆందోళన చేస్తున్న రైతుల బృందంలోని కొంత మంది వ్యక్తులకు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి చేసింది రైతులు కాదని..చంద్రబాబు పంపిన మనుషులు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. మరో వైపు మరో పామర్రు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై కూడా కొంత మంది దాడి చేసేందుకు ప్రయత్నించారు. విజయవాడలోని తోట్లవల్లూరు కరకట్ట వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకుని ఘోరావ్ చేశారు.
ఈ సమయంలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. చివరకు పోలీసులు వచ్చి ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను అక్కడ నుంచి పంపించారు. తొట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లోనే అరెస్ట్ చేసిన నారా లోకేష్ ను ఉంచటంతో అక్కడకు టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు.వెంటనే లోకేష్ తోపాటు ఎమ్మెల్యే రామానాయుడు ను విడుదల చేయలాంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ సమయంలోనే టైర్లు తగలబెట్టడంతోపాటు సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే రావటంతో పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది.