Telugu Gateway
Andhra Pradesh

అక్రమాలు జరిగాయంటారు..చర్యలెందుకు తీసుకోరు?

అక్రమాలు జరిగాయంటారు..చర్యలెందుకు తీసుకోరు?
X

వైసీపీ సర్కారుపై బిజెపి తీవ్ర స్థాయిలో మండిపడింది. అమరావతిలో అక్రమాలు జరిగాయంటారు..మరి చర్యలెందుకు తీసుకోరు అని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. అంటే అక్రమార్కులను వైసీపీ కాపాడే ప్రయత్నం చేస్తోందా? అని ప్రశ్నించారు. మంగళవారం నాడు ఢిల్లీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ తో కలసి మీడియాతో మాట్లాడారు. రాజధాని మార్పునకు కేంద్రం మద్దతు ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నా విమర్శించారు. వైసీపీ చేసే ప్రచారాన్ని ఎవరూ నమ్మరన్నారు. ఎన్నికలకు ముందు మూడు రాజధానులు అని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై జనసేనతో కలసి పోరాటం చేస్తామని కన్నా తెలిపారు. రాజధాని మార్పునకు ప్రభుత్వం చెబుతున్నట్లు ఖర్చు ఒక్కటే కారణం అని తాను భావించటంలేదని కన్నా తెలిపారు.

శివరామకృష్ణన్‌ కమిటీ వద్దని చెప్పినా గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. నాడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేశామని.. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఇప్పుడేమో ఏపీ రాజధాని అంశంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ నేతలు అంటున్నారని దుయ్యబట్టారు. తాము పెద్దన్నగా వ్యవహరిస్తే 23 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైకోర్టు ఏర్పాటుకు తాము పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. అమరావతిలో నాలుగేళ్లలో నాలుగు బిల్డింగులు కూడా కట్టని చంద్రబాబు చేతగాని వ్యక్తి. చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం. అందువల్లే అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయలేదు. అమరావతిలో మొదటి ముద్దాయి చంద్రబాబు. అమరావతి పేరుతో సేకరించిన నిధులు స్వాహా చేశారు. అమరావతిలో వేల కోట్లు దుర్వినియోగం చేశారు’ అని ఆరోపించారు.

Next Story
Share it