వైజాగ్ కు రాజధాని..20న ప్రత్యేక అసెంబ్లీ
అధికార వైసీపీ రాజధాని మార్పు కు సంబంధించి తాను అనుకున్న విధంగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీని కోసం ఏకంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం జనవరి 20న జరగనుంది.ఈ లోగానే ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ రాజధానికి సంబంధించి పలు సిఫారసులు చేయనుంది. జీఎన్ రావు కమిటీతోపాటు బోస్టన్ కమిటీ నివేదికల ఆధారంగా హై పవర్ కమిటీ సిఫారసులు ఉంటాయి. అయితే ఇవి ఎలా ఉంటాయో ఇప్పటికే బహిర్గతం అయిన విషయం తెలిసిందే.
న్యాయపరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు సర్కారు పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే కమిటీల మీద కమిటీలు వేసి నిర్ణయాలు తీసుకుంటోంది. జనవరి 20న జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో రాజధానుల వికేంద్రీకరణ అంశంపై చర్చ జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ లోగానే అంటే జనవరి 18న ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. మూడు రాజధానులకు సంబంధించి కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు చెబుతున్నారు.