Telugu Gateway
Andhra Pradesh

మూడు రాజధానులతో ఆ తప్పులు పునరావృతం కావు

మూడు రాజధానులతో ఆ తప్పులు పునరావృతం కావు
X

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి రాజదానుల అంశంపై స్పందించారు. మూడు రాజదానులతో పాత తప్పులు పునరావృతం కావాన్నారు. గతంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోవటం వల్లే ప్రాంతీయ ఉద్యమాలు వచ్చాయని..తాజా నిర్ణయంతో అలాంటి వాటికి ఛాన్స్ లేదన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారి కుంటాయని.. ప్రజాభిప్రాయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు. గతాన్ని పరిశీలిస్తే.. రాజధానిగా ఉన్న మద్రాస్‌ కర్నూలుకి మారిందని.. అక్కడ నుంచి హైదరాబాద్‌కి తరలిందని వివరించారు. రాజధాని పేరుతో ఒకేచోట అభివృద్ధి జరగటం వలన మిగిలిన ప్రాంతాలలో అసంతృప్తి పెరుగుతోందని చెప్పారు. ఒకేచోట అభివృద్ధి వల్ల మిగిలిన ప్రాంతాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గి.. పేదరికం పెరిగిందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.

వికేంద్రీకరణ జరగకపోవడం వలనే కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం జరిగిందని ప్రస్తావించారు. మూడు రాజధానుల ద్వారా రాష్ట్రమంతా సమాన అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారన్నారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిని ఆమోదించలేమని, రాష్ట్ర అభివృద్ధి గురించి కాకుండా కొన్ని గ్రామాల కోసం ఉద్యమించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని’ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థనైనా ఏర్పాటు చేయలేదని.. ఎందుకు తమ జిల్లా సమస్యలు పట్టించుకోలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర భవిష్యత్తు తరం కోసం తాము పోరాడుతున్నామని.. పాలన, అభివృద్ధి రెండూ వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయాలని తాము గతంలోనే కోరామన్నారు. విశాఖలో ఎయిర్‌,జల,రోడ్డు,రైల్వే మార్గాలున్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తంగా అభివృద్ధి చెందిన నగరాలన్నీ పోర్టు సిటీలేనని పేర్కొన్నారు.

Next Story
Share it