Telugu Gateway
Andhra Pradesh

అసెంబ్లీకి టీడీపీ దూరం..టీడీఎల్పీలో నిర్ణయం

అసెంబ్లీకి టీడీపీ దూరం..టీడీఎల్పీలో నిర్ణయం
X

తెలుగుదేశం పార్టీ సోమవారం నాటి అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. ఆదివారం నాడు చంద్రబాబునాయుడి అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఇప్పటికే ముగియాల్సి ఉన్నా..మండలి కొనసాగించాలా..వద్దా అనే అంశంపై సోమవారం నాడు సభలో చర్చించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మండలి రద్దు కోసమే సోమవారం ఉదయం కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధాన ఏజెండా మండలి రద్దే అని ప్రచారం జరుగుతోంది. అయితే మండలి రద్దును ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. అంతే కాదు తాము అధికారంలోకి వస్తే మళ్లీ మండలిని పునరుద్ధరిస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ తరుణంలో శాసనసభకు హాజరు కాకూడదని టీడీఎల్పీలో నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో మండలిలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించటం రాజ్యాంగ విరుద్ధం అని టీడీపీ వాదిస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా శాసనసభలో జరిగే చర్చలకు దూరంగా ఉండాలని టీడీఎల్పీ ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లులను పూర్తి చేసి వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని భావించిన ముఖ్యమంత్రి జగన్ కు మండలి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపాదించటం సర్కారు నిర్ణయాలకు తాత్కాలిక బ్రేక్ పడినట్లు అయింది. దీంతో సోమవారం నాడు అసెంబ్లీ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అన్నది అత్యంత కీలకంగా మారింది.

Next Story
Share it