Telugu Gateway
Telangana

సమత కేసు..నిందితులకు ఉరిశిక్ష

సమత కేసు..నిందితులకు ఉరిశిక్ష
X

జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్న నిందితులు..శిక్ష తగ్గించాలని వేడుకోలు

ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం నాడు సంచలన తీర్పు వెలువరించింది. సమతా రేప్ కేసులో నిందితులకు ఉరిశిక్ష ను ఖరారు చేసింది. సమతా రేప్..దారుణ హత్య కేసు తెలంగాణలో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూంలను దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు తుది తీర్పు నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. 2019 నవంబర్ 24న కుమరం భీం జిల్లాలోని ఎల్లాపటార్ గ్రామం వద్ద సమతపై నిందితులు సామూహిక అత్యాచారం చేసి..హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం అందించేందుకు హైకోర్టు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 11న ఈ కోర్టు ఏర్పాటైంది.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని ఆధారాలను సమర్పించటంతో తీర్పు వేగంగా రావటానికి మార్గం సుగమం అయింది. తీర్పు వెలువరించటానికి ముందు నిందితులను కోర్టు హాలులోకి పిలిచిన జడ్జి వారి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరం రుజువైందని నిందితులకు చెప్పారు. కుటుంబానికి తామే ఆధారమంటూ న్యాయమూర్తి ముందు నిందితులు కన్నీరు పెట్టుకున్నారు. ముగ్గురు నిందితులకు నలుగురు పిల్లలురున్నారని, శిక్ష తగ్గించాలని వేడుకున్నారు. సమత భర్త గోపి, కుటుంబ సభ్యులు కోర్టుకు చేరుకున్నారు. అలాగే సమత స్వగ్రామం గోనంపల్లె వాసులు సైతం కోర్టుకు భారీగా చేరుకున్నారు.

Next Story
Share it