Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు అహంకారం తగ్గలేదు

చంద్రబాబుకు అహంకారం తగ్గలేదు
X

వైసీపీ ఎమ్మెల్యే రోజా సోమవారం నాడు టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా చంద్రబాబుకు ఇంకా అహంకారం తగ్గలేదని ఆమె వ్యాఖ్యానించారు. రెండుసార్లు ఓడిపోయిన యనమల తానో పెద్ద మేధావిగా కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మేధావులు..పెద్దల కోసం ఏర్పాటు అయిన మండలిలోకి చంద్రబాబు తన దద్దమ్మను పంపించారని విమర్శించారు. ‘బాగా బలిసిన కోడి.. చికెన్ షాప్ కు వెళ్తే.. ఏమవుతుందో లోకేష్ గ్రహించాలని వ్యాఖ్యానించారు. పెద్దల సభ సూచనలు ఇవ్వాలి కానీ సంఘర్షణకు కారణం కాకూడదన్నారు.

రోజా సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్‌ అయితే యనమల రామకృష్ణుడు స్టీరింగ్‌ అని విమర్శించారు. మండలిలో ప్రజాతీర్పును టీడీపీ నేతలు అపహాస్యం చేశారని ఆరోపించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న మండలి అవసరం లేదని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారన్నారు. అమరావతిలో బినామీల భూముల కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని విమర్శించారు.

Next Story
Share it