Telugu Gateway
Politics

ప్రశాంత్ కిషోర్ పై నితీష్ కుమార్ వేటు

ప్రశాంత్ కిషోర్ పై నితీష్ కుమార్ వేటు
X

జనతాదళ్ యునైటెడ్ (జెడీయూ) ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై వేటు పడింది. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి, జెడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రకటించారు. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రశాంత్ కిషోర్ గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తీవ్రంగా విభేదిస్తున్నారు. ఈ అంశంపై ఆయన కాంగ్రెస్ పై ప్రశంసల వర్షం కూడా కురిపించారు. తాజాగా నితీష్ కుమార్ తాను కేవలం అమిత్ షా చెపితేనే ప్రశాంత్ కిషోర్ కు జెడీయూ ఉపాధ్యక్ష పదవి ఇఛ్చానని ప్రకటించి కలకలం రేపారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంటే నితీష్ కుమార్ అమిత్ షాకు సరెండర్ అయిపోయి..ఆయన ఏమి చెపితే అది చేస్తున్నట్లు అంగీకరిస్తున్నారా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

దీంతో ఆయనపై వేటు పడింది. అయితే పార్టీ నుంచి తనను బహిష్కరించటంపై ప్రశాంత్ కిషోర్ చాలా కూల్ గా స్పందించారు. ‘‘థాంక్యూ నితీశ్‌ కుమార్‌. మీరు మరోసారి బీహార్‌ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’’అని ట్వీట్‌ చేశారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పీకేతో పాటు పవన్‌ వర్మను కూడా పార్టీ నుంచి తొలగించారు. బీహార్‌లో జేడీయూ అధికారం చేపట్టడం, నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి కావడానికి ఆయన వ్యూహాలు రచించారు. ఈ క్రమంలోనే పీకే పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

Next Story
Share it