వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకూ నిద్రపోను
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల దాడిలో దెబ్బతిన్న అమరావతి రైతులను మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పరామర్శించిన అనంతరం పవన్ వాళ్లనుద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలోనే ఏపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకూ నిద్రపోను. వైసీపీ వినాశనం మొదలైంది. పాక్ష్యన్ తరహా పాలన చేయాని వైసీపీ చూస్తోంది. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే. ఇక ఏపీలో వైసీపీకి అధికారం రాకుండా చేస్తాం. అమరావతిలోనే శాశ్వత రాజధాని ఉండాలి. దివ్యాంగులు అని కూడా చూడకుండా పోలీసులు దాడులు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఉంటే వారిపై చర్యలు తీసుకోండి. వైసీపీ నేతలు విశాఖలో భూములు కొన్నారు. ఉత్తరాధంధ్రపై వైసీపీకి ప్రేమ లేదు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూడా అదే తరహాలో కూలిపోవటం ఖాయం. చివరకు పోలీసులను కూడా రౌడీలుగా మార్చారు. పోలీసుల పేరుతో అసాంఘిక శక్తులు అందులోకి ప్రవేశించాయి. గొడవలతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. లేకపోతే మా పార్టీ కార్యాలయంలోకి వచ్చిన పోలీసులను బయట పడేయటం మాకు పెద్ద కష్టం కాదు. టీడీపీలా నేను అబద్దాలు చెప్పను. చేయగలిగింది మాత్రమే చెబుతా. అంతే కానీ..టీవీల్లో కన్పించటం లేదు..పేపర్లలో రావటం లేదు అంటే చేయగలిగేది ఏమీ ఉండదు. జగన్ 30 రాజధానులు చేసినా తిరిగి అమరావతినే శాశ్వత రాజదాని చేస్తాం ’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.సోమవారం నాడు నిరసనలో రైతులు కాదు..పోలీసులే రాళ్ళు వేశారన్నారు పవన్ కళ్యాణ్.
తనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని..తన ఢిల్లీ పర్యటనతో ఏదో అద్భుతాలు జరుగుతాయని చెప్పటం లేదు కానీ..తాము చేయగలిగింది అంతా చేస్తామని చెప్పారు. మహిళలకు తగిలిన దెబ్బలు చూసి కన్నీళ్లు వస్తున్నాయని..కానీ సభా మర్యాద కాదు కాబట్టి నియంత్రించుకుంటున్నట్లు పవన్ తెలిపారు. జగన్ చేసేది ఏమి చేసుకున్నా..అమరావతిలోనే శాశ్వత రాజధాని ఉంటుందని..రెండున్నర ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు మారిపోవచ్చని..కాకపోతే అప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఢిల్లీలో బుధవారం నాడు జనసేన-బిజెపి నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అంతకు ముందు పవన్ కాకినాడకు చెందిన జనసేన నాయకులు,కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ “రాయలసీమలో ప్రతి ముద్దకీ పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉండవు. గోదావరి జిల్లాలకు కూడా అలాంటి సంస్కృతిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ తరహా క్రిమినల్ రాజకీయాలను పారద్రోలాలన్నదే నా లక్ష్యం. వైసీపీ నాయకులు మనల్ని తిడుతున్నారు అంటే మనం చాలా బలమైన స్థాయిలో ఉన్నామని అర్ధం. వాళ్లకి మన సమూహం అంటే భయం. అంతటి బలమైన సమూహం మనకి ఉంది. వీళ్లు వస్తే అంతా మార్చేస్తారన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. కొత్త నాయకులను, ఓ సరికొత్త రాజకీయ వ్యవస్థను తయారు చేయాలన్నదే నా జీవితాశయం. సమాజానికి బలంగా నిలబడగలిగే నాయకత్వాన్ని తీసుకువచ్చినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. అప్పుడే రెండు, మూడు తరాలు బాగుపడతాయి. మనం ఒక రోల్ మోడల్ కావాలి. ఒక మాట మాట్లాడితే అది లక్ష మంది మెదళ్లలో ఆలోచన రేపాలి. పీఆర్పీ లాంటి వైఫల్యం తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 7 శాతం ఓట్లు సాధించడం అంటే చాలా బలమైన అంశం.
ప్రతికూల పరిస్థితుల్లో వచ్చిన ఓట్లు చాలా విలువైనవి. పీఆర్పీ అన్న ప్రాసెస్ లేకుండా జనసేన పార్టీ వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. మనం సున్నా నుంచి మొదలు కాలేదు. గొయ్యి పూడ్చుకుంటూ పైకి వచ్చి ఈ స్థాయిలో నిలబడడం అంటే అది చాలా బలమైన సంకేతం. మాట మాట్లాడితే అది చేయగలిగేది అయితేనే మాట్లాడాలి. మీరు వేసే ప్రతి అడుగు స్థిరంగా ఉండాలి. నేను ఏది మాట్లాడినా నిజమే మాట్లాడుతా. అందుకే ఇబ్బందిగా, చేదుగా ఉంటుంది. రాజధానికి విషయంలో 2015లోనే ఇంత భూ సమీకరణ వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పాను. అప్పుడు ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కొత్త పార్టీ అధికారంలోకి రాగానే రైతుల భవిష్యత్తు రోడ్డు మీదకి వచ్చింది. వైసీపీని నేను వ్యతిరేకించడానికి కారణం...గతంలో కూడా రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ఒక్కరూ ఆ ప్రాంతం నుంచి వెనకబాటును పారద్రోల లేకపోయారు. నాయకులు బాగుపడ్డారు తప్ప, ప్రజలు బాగుపడలేదని అన్నారు.