Telugu Gateway
Andhra Pradesh

మూడు రాజధానులకు కేంద్రం సమ్మతి లేదు

మూడు రాజధానులకు కేంద్రం సమ్మతి లేదు
X

అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని..ఈ విషయంలో తాము బిజెపితో కలసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాజధానిని మార్చడం అంత తేలిక కాదని పేర్కొన్నారు. విశాఖలో గణతంత్ర దినోత్సవం జరుపుతామని ప్రకటించి..అన్ని ఏర్పాట్లు చేసుకుని కూడా వెనక్కి తగ్గారని..అలాంటిది రాజధాని మార్పు అంత తేలిగ్గా జరుగుతుందా? అని ప్రశ్నించారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రం జోక్యం చేసుకోదని అన్నారు. రాజకీయంగానే తాము పోరాటం చేస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు. ఆయనతోపాటు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ, బిజెపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తదితరులు ఉన్నారు.

నిర్మలా సీతారామన్ తో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి కానీ వాటి పనితీరు మాత్రం ఏమీ మారలేదని ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి వినియోగ పత్రాలు (యూసీ)లు సమర్పించటంలేదని పవన్ వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ తో రాజధాని అంశంపై కూడా చర్చించామని చెప్పారు. మూడు రాజధానులకు కేంద్ర ప్రభుత్వ సమ్మతి లేదన్నారు. కేంద్రాన్ని భ్రష్టుపట్టించేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఇఫ్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని, శాశ్వత ప్రణాళికలతో పాలన సాగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. టీడీపీ హయాంలో కేంద్రం ఏపీకి ఎలాంటి సాయం అందించిందో ఇప్పుడు కూడా అదే రీతిలో అందిస్తుందని తెలిపారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న మహిళలను సైతం దారుణంగా హింసించారని పవన్ ఆరోపించారు.

Next Story
Share it