బిజెపిలోకి మోహన్ బాబు!
ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు సోమవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంచు విష్ణు, విరోనిక, మంచు లక్ష్మీ కూడా ఉన్నారు. మోడీతో వీరి సమావేశం 35 నిమిషాల పాటు సాగింది. ఈ సందర్భంగా ప్రధాని వీరిని బిజెపిలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం. వీరు త్వరలోనే బిజెపిలో చేరతారని సమాచారం. వీరంతా సోమవారం సాయంత్రం 6 గంటలకు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలవనున్నారు. మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీలో ఉన్న విషయం తెలిసిందే.
ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటంతోపాటు వైసీపీ తరపున కూడా చంద్రబాబును ఎటాక్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ అప్రతిహత విజయం దక్కించుకున్న తర్వాత మోహన్ బాబుకు ఏదో ఒక నామినేటెడ్ పోస్టు వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత అసలు మోహన్ బాబు ఊసేలేదు. ఈ తరుణంలో ఆయన బిజెపిలో చేరతారు అన్న ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన వచ్చేవరకూ దీనిపై సస్పెన్స్ అలా కొనసాగే అవకాశం ఉంది.