Top
Telugu Gateway

‘మా’ భవన నిర్మాణం..ఓ పోలవరం ప్రాజెక్టా?

‘మా’ భవన నిర్మాణం..ఓ పోలవరం ప్రాజెక్టా?
X

మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు సొంత భవనం నిర్మాణం ఏమైనా పోలవరం ప్రాజెక్టా?. గత కొన్ని సంవత్సరాలుగా ఓ భవనం నిర్మించుకోవటానికి మహామహులు ఉండి కూడా టాలీవుడ్ మల్లగుల్లాలు పడుతోంది. ప్రతి ‘మా’ ఎన్నికలోనూ ఇదే ప్రధాన ఏజెండా. తమను ఎన్నుకుంటే ‘మా’కు సొంత భవనం నిర్మిస్తామని హామీ ఇవ్వటం..మళ్లీ ఎన్నికలు జరగటం. ఇది పరిపాటిగా మారిపోయింది. నిజంగానే సర్కారు భూమి ఇస్తే తప్ప భవనం కట్టుకోలేని నిరుపేదలుగా సినిమా పరిశ్రమలోని ప్రముఖులు ఉన్నారా?. టాలీవుడ్ లో టాప్ హీరోలు ఒక్కో సినిమాకు తీసుకునే పారితోషికాలే 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకూ ఉంటున్నాయి. హీరోయిన్లకూ భారీ ఎత్తున పారితోషికాలు అందుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులే ఒక రోజు షెడ్యూల్ కు మూడు లక్షల రూపాయల వరకూ పారితోషికం తీసుకుంటున్నారు. మాలో సభ్యత్వం ఉన్న నటీనటుల పారితోషికం నుంచి కొంత మొత్తాలను ‘మా’ భవన నిర్మాణం కోసం తీసుకోవాలని గతంలోనే ప్రతిపాదించారు. కానీ అది ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు.

‘మా’ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ ఓ బృందం గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ను కలిసింది. ఆయన నవ్వుతూనే ఆ బృందంలో ఉన్న మురళీమోహన్ ను చూపిస్తూ ఆయన్ను పక్కన పెట్టుకుని మీరు ప్రభుత్వ భూమి అడుగుతారా అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. దీనికి కారణం ఏంటంటే మురళీమోహన్ కు భారీ ఎత్తున హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ బ్యాంకు ఉండటమే. అప్పటి నుంచి ఈ ప్రతిపాదన అలా అటకెక్కిపోయింది. తాజాగా మళ్ళీ ‘మా’ భవన నిర్మాణ అంశం తెరపైకి వచ్చింది. భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నామని చెప్పి తొలి వారంలో ప్రేక్షకుల దగ్గర నుంచి అధిక డబ్బు గుంజటానికి చూసే పరిశ్రమ ప్రముఖులు సొంత భవన నిర్మాణం కోసం ప్రభుత్వ సాయం కోరాల్సిందేనా?. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్లు తీసుకునే హీరోలు, దర్శకులు, హీరోయిన్లు ఉన్న పరిశ్రమ పెద్దలు నిధులు సమకూర్చుకుని భూమి కొనుగోలు చేయలేరా?.

సొంతంగా ‘మా’ భవన నిర్మాణం తోపాటు పరిశ్రమ అవసరాల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఆడిటోరియటం కట్టుకోలేదా? అన్న ప్రశ్నలు పరిశ్రమ వర్గాల నుంచే విన్పిస్తున్నాయి. అదే తమిళనాడులో అయితే అక్కడి పరిశ్రమ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సొంతంగానే పూర్తి చేసుకుంది. కానీ తెలుగు పరిశ్రమ మాత్రం ఎక్కడికి అక్కడ ఆదిపత్య ప్రదర్శన, ప్రభుత్వాలతో అంటకాగి సొంత పనులు చేయించుకోవటంపైనే ఫోకస్ పెడుతున్నాయి. పరిశ్రమకు పనికొచ్చే పనుల కంటే స్వప్రయోజనాల కోసం ప్రముఖులు తాపత్రయపడుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. శివాజీరాజా, కాదంబరి కిరణ్ లు ‘మా’కు ఎన్నికైన సమయంలోనే పేద కళాకారులకు పెన్షన్ స్కీమ్ వంటి మంచి పనులు చేశారని..ఇది తప్ప ప్రముఖులు అని చెప్పుకున్న వారెవరూ కూడా ఏమీ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. చూస్తుంటే ‘మా’కు సొంత భవనం నిర్మాణం కూడా పోలవరం ప్రాజెక్టు తరహాలో సంవత్సరాల తరబడి సాగదీస్తున్నారనే విమర్శలు పరిశ్రమ ప్రముఖులు ఎదుర్కొంటున్నారు.

Next Story
Share it