Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు లాంటి జీవితం కంటే వైఎస్ లాంటి చావే మంచిది

చంద్రబాబు లాంటి జీవితం కంటే వైఎస్ లాంటి చావే మంచిది
X

ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు డెబ్బయి సంవత్సరాలు వచ్చాయని..ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కుని..విజన్ 2020 అంటూ..పార్టీని 20 సీట్లకు పరిమితం చేశాడని ఎద్దేవా చేశారు. చివరకు సొంత కొడుకును కూడా గెలిపించుకోలేని వ్యక్తి అని విమర్శించారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో..దివంగత రాజశేఖరరెడ్డిపై కూడా విమర్శలు చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులాంటి జీవితం కంటే వైఎస్ లాంటి చావే మంచిదని వ్యాఖ్యనించారు. చనిపోయినా కూడా ప్రజల్లో జీవించి ఉన్న నాయకుడు వైఎస్ఆర్ అని కొడాలి నాని వ్యాఖ్యినించారు. తాను కూడా వస్తే అలాంటి చావునే స్వాగతిస్తానని పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశంపై కొడాలి మాట్లాడారు. తమిళనాడులో ఉన్నప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వరకు గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ది చెందే ఉన్నాయని అన్నారు. అసలు అమరావతిని చంద్రబాబు పాడుబడేలా చేసి..తన అమరావతిలో హంగామా చేయాలని చూశారన్నారు. అమరావతి వల్ల ఈ రెండు జిల్లాలకు వచ్చేదేమీ లేదని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నాని కృతఙ్ఞతలు తెలిపారు. సామాజిక అంశాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

రాజధాని తరలిపోతే కమ్మ కులస్తులకు అన్యాయం జరుగుతుందని.. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని నాని అసెంబ్లీ వేదికగా ధ్వజమెత్తారు. కేవలం కమ్మవారి కోసమే ఇక్కడ రాజధాని పెట్టారా..? అని ప్రశ్నించారు. వైజాగ్ లో కూడా కమ్మ వాళ్ళకు చాలా వ్యాపారాలు ఉన్నాయని..ఎవరూ చంద్రబాబు మాటలు నమ్మోద్దని వ్యాఖ్యానించారు. ‘డబ్బా మీడియా, చెత్త పేపర్లతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీకి మధ్యలో ఉంటేనే అమరావతి అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు చెప్తున్నారు. భారత దేశానికి ఢిల్లీ మధ్యలో ఉందా..? రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆలోచించడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలే కోసమే పరితపిస్తున్నారు. చంద్రబాబుకు స్పష్టత కరువైందని ఆరోపించారు. నిజంగా ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తుంటే..చంద్రబాబుకు అంత నమ్మకం ఉంటే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకుని రావాలని సవాల్ విసిరారు.

Next Story
Share it