Telugu Gateway
Andhra Pradesh

జె సీ దివాకర్ రెడ్డికి జగన్ సర్కారు షాక్

జె సీ దివాకర్ రెడ్డికి జగన్ సర్కారు షాక్
X

త్రిసూల్ సిమెంట్స్ మైనింగ్ లీజులు రద్దు

తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డికి మరో షాక్. ఇప్పటికే జగన్ సర్కారు దెబ్బకు ట్రావెల్స్ బిజినెస్ సమస్యల్లో చిక్కుకోగా..ఇప్పుడు జె సీ ఫ్యామిలీకి చెందిన త్రిసూల్ సిమెంట్స్ కంపెనీ మైనింగ్ లీజులను సర్కారు రద్దు చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం జిల్లాలోని యాడికిలో త్రిసూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజు ఉంది. కొనుప్పలపాడులో 649.86 హెకార్ట సున్నపురాతి గనుల లీజు రద్దు చేస్తున్నట్టు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

సిమెంట్‌ తయారీ ప్లాంట్‌ నిర్మాణానికి.. మరో ఐదేళ్ల పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడనందునే లీజు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్‌ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

నాకు జరిగిన అన్యాయమెంత?

త్రిసూల్ సిమెంట్స్ లీజుల రద్దు వ్యవహారంపై జె సీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పగ.. పగ.. పగ అంటూ రగిలిపోతోందన్నారు. అయినా రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే.. తనకు జరిగిందెంత అని ప్రశ్నించారు. ఎవడు మాట వినకపోయినా వాళ్ల మీద ప్రభుత్వం పగ తీర్చుకుంటుందని జేసీ ఆరోపించారు. ఆర్థిక మూలాలు దెబ్బ తీయడం.. భార్యా పిల్లలు అడుక్కు తింటే చూసి వాళ్లకు ఇగో శాంతిస్తుందన్నారు. బాధించడమే.. ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీన్నే ఫ్యాక్షనిజం అంటారని జేసీ వ్యాఖ్యానించారు.

Next Story
Share it