Telugu Gateway
Andhra Pradesh

జగన్ మాటల్లో తేనే..చేతల్లో కత్తులతో పొడిచేయటమే

జగన్ మాటల్లో తేనే..చేతల్లో కత్తులతో పొడిచేయటమే
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటల్లో తేనే ఉంటుందని..చేతల్లో మాత్రం కత్తులతో పొడిచేస్తారని అన్నారు. పార్లమెంట్ లో పౌరసత్వ సవరణ చట్టాని (సీఏఏ)కి వైసీపీ మద్దతు ఇస్తుంది. కానీ ఇక్కడ మాత్రం తాము దానికి వ్యతిరేకం అని ప్రచారం చేసుకుంటుంది. ఇదెక్కడి పద్దతి అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన సోమవారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నేతలతో సమావేశం అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీ వాళ్లు సెక్యులరిజం అంటారు. కడపలో ముస్లిం సోదరుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అంతా కలసికట్టుగా ఉంటే అపోహలు రావు. మేము నెల్లూరులో ఉండగా రొట్టెల పండుగ చేసుకునే వాళ్లం. అక్కడ అసలు మతం అనేది ఎక్కడ ఉంటుంది. కొత్త తరంలో అయినా మార్పు రావాలి. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సమస్యలు వస్తే అవి పార్టీ పరిధిలో మాట్లాడుకుందాం. బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన నేను మతోన్మాదిని అయిపోను. అది నిజంగా మతోన్మాదులు ఉన్న పార్టీ అయితే దేశంలో ఇంత భద్రత ఉండదు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు సెక్యులర్ పార్టీలే. వారి స్టాండ్ మాత్రమే వేరు ఉంటుంది. బీజేపీ సెక్యులర్ పార్టీ కాదు అంటే వైసీపీ ఎలా అవుతుంది. వైసీపీ వాళ్లు చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఉంటుంది. ఎన్ఆర్సీ భారత దేశంలోని ప్రతి పౌరుడికి వర్తిస్తుందనీ, కేవలం ముస్లింల కోసం మాత్రమే పెట్టింది కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీ వల్ల పౌరసత్వం తీసేస్తారన్న భయాలు ఎవరికీ అవసరం లేదనీ, కొంతమంది ఉద్దేశపూర్వకంగానే మత ప్రాతిపదికన ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఈ అంశానికి సంబంధించి ముస్లిం సోదరుల్లో ఉన్న భయాలు, అపోహలు తొలగించేందుకు ప్రత్యేకంగా ఓ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. న్యాయ నిపుణులతో వారి సందేహాలు నివృత్తి చేస్తామన్నారు. భారత రాజ్యాంగం గొప్పది. మత ప్రాతిపదికన ప్రజల్ని విడదీయదు. మతం పేరుతో మనుషుల్ని విడదీయడం సాధ్యం కాదు. తాత, తండ్రి వివరాలు అందుబాటులో లేకపోతే మీరు భారత పౌరులు కారు అనుకోవద్దు. అది సాధ్యపడదు కూడా. ప్రభుత్వాలు మారినప్పుడు తమ విధానానికి అనుగుణంగా వివరాలు సేకరిస్తాయి. తెలంగాణలో సకల జనుల సర్వే అని పెట్టినప్పుడు కూడా ఆంధ్రవారిని సపరేట్ చేయడానికని అపోహలు రేపారు. అలాంటివి చేయడం అసాధ్యం. ఆధార్ కోసం వివరాలు కోరినప్పుడు కూడా చాలామందిలో సందేహాలు వచ్చాయి... ఓ ప్రైవేట్ కంపెనీకి ఇస్తే ఏం జరుగుతుందోనన్న అనుమానం వచ్చింది. అయితే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలి.’ అన్నారు.

Next Story
Share it