Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా

చంద్రబాబు సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా
X

ఏపీలో శాసనమండలి ఉంటుందా?. ఊడుతుందా?. ఇదే సస్పెన్స్. అది సోమవారంతో వీడిపోనుంది. ఈ తరుణంలో తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆదివారం నాడు టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. అయితే వీరంతా టీడీపీకి ఝలక్ ఇచ్చారా?. లేక నిజంగానే వ్యక్తిగత కారణాలతో డుమ్మా కొట్టారా అన్న సంగతి రాబోయే రోజుల్లో కానీ తేలదు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. డొక్కా మాణిక్యవరప్రసాద్ తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సమావేశాలకు దూరం ఉండిపోయారు. ఇద్దరు ఎమ్మెల్సీలు మండలిలో పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు వైసీపీకి అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొని టీడీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీఎల్పీ సమావేశానికి దూరంగా ఉన్న వారిలో గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, శమంతకమణి ఉన్నారు.

శాసన మండలిలో రాజధాని వికేంద్రకీరణ బిల్లుకు టీడీపీ అడ్డుచక్రం వేయటంతో మండలి భవిష్యత్ ప్రమాదంలో పడినట్లు అయింది. ఇది కొంత మంది టీడీపీ ఎమ్మెల్సీలకు ఏ మాత్రం మింగుపడటం లేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉన్న పదవులు కూడా వదులుకుంటే తమ భవిష్యత్ మరింత ప్రమాదంలో పడుతుందని కొంత మంది నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబునాయుడు కూడా ఎమ్మెల్సీలను బుజ్జగించే పనిలో ఉన్నారు. పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని, లేదంటే ఇబ్బందులు పడతామని చెబుతూ వస్తున్నారు. మండలి పొలిటికల్ గేమ్ లో అంతిమ విజేతగా ఎవరు నిలుస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it