Telugu Gateway
Andhra Pradesh

చేతులెత్తి నమస్కరిస్తున్నా..మూడు రాజధానుల వద్దు

చేతులెత్తి నమస్కరిస్తున్నా..మూడు రాజధానుల వద్దు
X

తెలుగుదేశం అధినేత, ప్రతిఫక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. వయస్సులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డికి చేతులెత్తి నమస్కరిస్తున్నా..రాజధాని తరలింపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు. తన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ ముందుకు తీసుకెళ్లారని..దీని వల్ల వైఎస్ తోపాటు తనకూ మంచి పేరు వచ్చిందని తెలిపారు. అందుకే జగన్ ను కూడా అమరావతిని కొనసాగించాలని కోరుతున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అన్నీ పోను అమరావతిలో పది వేల ఎకరాల భూమి ఉందని..ఈ భూమిని ఉపయోగించి రాజధాని నిర్మాణంతోపాటు సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకోవచ్చని అన్నారు. మాట్లాడితే అందరూ డబ్బులు లేవని చెబుతున్నారని..ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, మండలి, సచివాలయాన్ని వాడుకోవచ్చు కదా?అని వ్యాఖ్యానించారు. ఇది తాత్కాలిక భవనాలు కావని..ఇవి ఏమైనా గుడారాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. తాము వీటిని ‘ట్రాన్సిట్ ’ క్యాపిటల్ గా ప్రకటించామని..తర్వాత ఐకానిక్ భవనాలు నిర్మిద్దామనుకున్నామని..మీకు అర్ధం కాకపోతే ఎవరేమీ చేస్తారని చంద్రబాబు వైసీపీ సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఎంత సమయం ఇచ్చినా తన ప్రసంగాన్ని పూర్తి చేయకపోవటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సమాధానం ప్రారంభించారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియం ను చుట్టుముట్టి జై అమరావతి..జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. పోడియం దగ్గర ఆందోళనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు.

Next Story
Share it