Telugu Gateway
Telangana

‘కరోనా’ కలకలం..తెలంగాణలోనూ అప్రమత్తం

‘కరోనా’ కలకలం..తెలంగాణలోనూ అప్రమత్తం
X

కరోనా వైరస్. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. అయితే ఈ వైరస్ ప్రభావం ప్రస్తుతం చైనాలోనే తీవ్రంగా ఉంది. తొలుత ఈ వైరస్ ను గుర్తించింది కూడా అక్కడే. ఇప్పటికే వందల సంఖ్యలో ఈ వైరస్ కారణంగా చైనాలో మృత్యువాతపడ్డారు. ఇంకా 1400 మందికి వరకూ చైనాలో కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొందుతున్నారు. పలు దేశాలకు ఈ వైరస్ పాకిందనే వార్తలు ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తున్నాయి. పలు దేశాలు ఈ విషయంలో అప్రమత్తం అవుతున్నాయి. అంతే కాదు..విమానాశ్రయాల్లో ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు స్ర్కీనింగ్ టెస్ట్ లు నిర్వహించి మరీ బయటకు పంపిస్తున్నారు. ఎక్కడైనా అనుమానం వచ్చినా..వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించినా అలాంటి వారిని మాత్రం ఈ వైరస్ కు ట్రీట్ మెంట్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ వైరస్‌ ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్‌పై వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. కరోనా వైరస్‌ తెలంగాణలో ఉన్నట్లు ఇంకా ఎలాంటి నిర్ధరణ కాలేదని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు పర్యవేక్షిస్తోందన్నారు. కరోనా వైరస్‌పై బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కేంద్ర బృందం కూడా ప్రస్తుతం నగరంలోని పలు ఆసుపత్రుల్లో పర్యటిస్తోందని, వైరస్‌పై వైద్యులకు తగు సూచనలు చేస్తోందని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఈటల పేర్కొన్నారు. తెలంగాణతోపాటు ఏపీలోని విమానాశ్రయాల్లోనూ ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Next Story
Share it