Telugu Gateway
Cinema

చిరు జగన్ కు ‘ఆ హామీ’ ఇచ్చారా!

చిరు జగన్ కు ‘ఆ హామీ’ ఇచ్చారా!
X

‘మా’లో ఆదిపత్య గొడవలకు అదే కారణమా?

తెలుగు సినీ పరిశ్రమను వైజాగ్ కు తరలిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిరంజీవి హామీ ఇచ్చారా?. ‘మా’లో ఆదిపత్య పోరుకు ఇదే కారణమా?. అంటే ఔననే చెబుతున్నాయి ‘మా’లో ని వర్గాలు. చిరంజీవి ఇటీవల కాలంలో సీఎం జగన్ కు సన్నిహితం అవుతున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా కనీసం జగన్ వైపు చూడని చిరంజీవి ఇఫ్పుడు తెరమీదకు వచ్చి ‘షో’ అంతా తానే చేశానని చెప్పుకునే ప్రయత్నం చేయటం ఏంటి అని ‘మా’లోని జగన్ అనుకూల వర్గం మంటగా ఉంది. వాస్తవానికి రాజశేఖర్, జీవితతోపాటు అలీ, పృథ్వీరాజ్, విజయ్ చందర్ తదితరులు అందరూ చిరు కంటే ముందు నుంచి వైసీపీతో సన్నిహితంగా ఉన్నారు. ‘మా’లో సీఎంతో సాన్నిహిత్యంగా ఉన్న పాత, కొత్త గ్రూపుల మధ్య ఆదిపత్యపోరే వివాదాలకు కారణం అవుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. చిరు గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

సినీ పరిశ్రమలో ఎవరూ ఏపీలోని ‘మూడు రాజధానుల’ వ్యవహారంపై స్పందించలేదు. కానీ చిరంజీవి మాత్రం జగన్ నిర్ణయానికి అనుకూలంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అంతే కాకుండా విశాఖపట్నంలో చిరంజీవి భూమి ఉందని..అందుకే రాజధానికి అనుకూలంగా మాట్లాడారనే విమర్శలూ విన్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కుటుంబ సమేతంగా అమరావతి వెళ్లి చిరంజీవి ఫ్యామిలీ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ‘మా’లో జరిగిన గొడవలో కూడా చిరంజీవి, మోహన్ బాబులు మాత్రమే రాజశేఖర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయగా..అదే వేదికపై ఉన్న మరో సీనియర్ నటుడు మురళీమోహన్ మౌనంగా చూస్తూ ఉండిపోయారే తప్ప స్పందించలేదు. ‘మా’ డైరీ ఆవిష్కరణ వేదికపై కృష్ణంరాజుకు సీటు ఇవ్వటం తప్పు లేకపోయినా ఆయన భార్యను కూడా వేదికపై కూర్చోపెట్టి సీనియర్ నటుడు అయిన రాజశేఖర్ వంటి వాళ్ళను అవమానించారని ఆ వర్గం వారు ఆరోపిస్తున్నారు. కృష్ణంరాజు అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆయనకు అండగా వచ్చినా వెనక వరసలో కూర్చోపెట్టి మిగిలిన వారికి అవకాశం ఇఛ్చి ఉంటే ప్రొటోకాల్ పాటించినట్లు అయ్యేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

‘మా’లో రాజకీయాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని..కొంత మంది వైసీపీకి అనుకూలంగా..మరికొంత మంది టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాలో సభ్యులు చెబుతున్నారు. నిన్న చిరంజీవి వేదికపై మాట్లాడుతూ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కోసం తానే అందరినీ ఆహ్వానిస్తానని చెబుతూ అల్లు అర్జున్, రామ్ చరణ్ పేర్లను ప్రస్తావించారే కానీ మహేష్ బాబు, ఎన్టీఆర్ పేర్ల ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఈ వీడియోను కూడా ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున షేర్ చేశారు. పూర్తిగా రాజకీయాలతో నిండిన ‘మా’తో గొడవ ఎందుకని యువ హీరోలు ఎవరూ కూడా ఈ రచ్చలో చేరకుండా దూరం దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి ‘మా’లో విభేదాలు కొన్ని నెలల కిందటే బహిర్గతం అయ్యాయి. మరి పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలనుకుంటున్న చిరంజీవి ఇంత చిన్న సమస్యను నెలల తరబడి ఎందుకు పరిష్కరించలేకపోయారన్న దానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. నిజంగా పెద్దగా వ్యవహరించాలనుకుంటే రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదర్చటం సాద్యం కాదా?. ఆ విభేదాలను అలా ఉంచి ఎవరికి వారు ‘మా’పై పట్టు పెంచుకునే పనిలో ఉన్నారని చెబుతున్నారు.

Next Story
Share it