Telugu Gateway
Andhra Pradesh

ఈనాడు మా బాస్ కాదు..మా ఆలోచనలు మాకుంటాయి

ఈనాడు మా బాస్ కాదు..మా ఆలోచనలు మాకుంటాయి
X

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈనాడు పేపర్ మా బాస్ కాదు. మా ఆలోచనలు మాకుంటాయి. ఏది చేస్తే రాష్ట్రానికి మంచిదో మేం అదే చేస్తాం. అమ్మ ఒడిపై కొన్ని పత్రికలు, ఛానళ్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఒక్కరే విపక్ష నేత కాదు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది.’ అని మంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఈనాడుకు ఇష్టం లేదా? లక్షా 9వేల కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారని ఏనాడైనా చంద్రబాబును ప్రశ్నించారా? రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మాకు తెలుసు. మాది బాధ్యతగల ప్రభుత్వం. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజలు క్షమించరు. చంద్రబాబు మాయ మాటలు ఎవరు నమ్ముతారు? అనుభవం ఉందని అధికారం ఇస్తే అయిదేళ్లు బాబు మోసం చేశారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే తాత్కాలిక భవనాలే కట్టారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రజా ప్రతినిధులను నారా లోకేష్‌ విమర్శించడం తగదు.

ముందు ఆయన భాష నేర్చుకోవాలి. ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల అనంతరం మరోలా రాజధానిపై ఈనాడు దినపత్రిక రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి ఆరోపించారు. ఎందుకు, ఎవరి కోసం ఈ రాతలు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, ఈనాడు కుట్ర పన్నుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారని బొత్స విమర్శించారు. ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు సమాజం కోసం కాకుండా తమ సామాజిక వర్గం కోసం పని చేస్తున్నాయని విమర్శించారు. సమాజ స్ఫూర్తి కంటే సామాజిక స్ఫూర్తి ఎక్కువగా ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలియవా అంటూ బొత్స ప్రశ్నించారు. రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి చంద్రబాబు ఏమి చేశారు. రాజధాని నిర్మాణానికి లక్ష 9 వేల 23 కోట్లు ఖర్చు అవుతుందని ఇదే వార్త 2018లో ఈనాడులో వార్త రాశారు.

మరి ఇప్పుడు అమరావతికి పైసా ఖర్చు అవసరం లేదని రాయించారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలో ఏం చెప్పిందో ఈనాడులో వేయగలరా? రాజధాని రైతులకు చిత్తశుద్ధితో న్యాయం చేస్తాం. మీకేం కావాలో... మీకేం న్యాయం చేయాలో చెప్పండి. అమరావతి రైతులు చంద్రబాబు ఉచ్చులో పడొద్దు. చంద్రబాబు బెదిరింపులకు భయపడేది లేదు. ఇప్పటికైనా ఆయన బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మానుకోవాలి. అన్ని కమిటీల నివేదిక పరిశీలన తర్వాతే రాజధానిపై నిర్ణయం. అన్ని అంశాలు అసెంబ్లీలో చర్చిస్తాం. రాజధాని రైతులకు గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదే అమలు చేస్తాం. లేదంటే ఆ రైతులు ఆలోచన మార్చుకుంటే చర్చిస్తాం. రాజధాని రైతులకు మేలు జరిగే పనులే చేస్తాం. మన స్వార్థాల కంటే... మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఏపీ ప్రజల అభివృద్ధి, శాంతి భద్రతలు ముఖ్యం.

Next Story
Share it