Telugu Gateway
Andhra Pradesh

మండలిలో వైసీపీ సర్కారుకు షాక్

మండలిలో వైసీపీ సర్కారుకు షాక్
X

మూడు రాజధానుల’ పరిస్థితి ఏంటి?

జాప్యం తప్ప మార్పేమీ ఉండదు

వైసీపీ సర్కారు దూకుడుకి బ్రేక్. ఎలాగైనా అమరావతి నుంచి విశాఖపట్నానికి అత్యంత వేగంగా రాజధానిని తరలించాలని సర్కారు చేసిన ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై అందరి దృష్టి మండలిపైనే ఉంది. దీనికి ప్రధాన కారణం అక్కడ మెజారిటీ ప్రతిపక్ష టీడీపీకి ఉండటమే. మంగళవారం నాడు అసలు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్ డీఏ చట్టం రద్దు బిల్లులు పెట్టనీయకుండానే విపక్ష టీడీపీ రూల్ 71 పేరుతో అడ్డుకుంది. చివరకు ఎలాగోలా సాయంత్రం మాత్రం బిల్లులను మండలి ఛైర్మన్ షరీఫ్ సభలో ప్రవేశపెట్టడానికి అనుమతించారు. బుధవారం నాడు కూడా హైఓల్టేజ్ పరిణామాలతో చర్చలు సాగినా రాత్రి పది గంటలకు క్లైమాక్స్ కు చేరాయి. ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని శానసమండలి నిర్ణయిచింది. ఈ మేరకు మండలి ఛైర్మన్ షరీఫ్ సభలో ప్రకటన చేశారు.

అత్యంత ఉత్కంఠ మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎలాగైనా ఈ బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు వైసీపీ మంత్రులు, సభ్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. శాసనమండలి ఛైర్మన్ పోడియంను చుట్టి ముట్టారు. కానీ అవేమీ ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయంలో మండలిలో టీడీపీ పైచేయి సాధించినట్లు అయింది. అయితే అధికార వైసీపీ మాత్రం ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో రగిలిపోతుంది. తాము పూర్తిగా నిబంధనల ప్రకారమే వెళ్లాలని కోరినా మండలి ఛైర్మన్ మాత్రం ప్రతిపక్షం ఒత్తిడికి లోనైనట్లు ఆరోపిస్తున్నారు.

మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమైనా విధానపరమైనన లోపాలు ఉంటే ఉన్నాయేమో కానీ..ఛైర్మన్ నిర్ణయమే అంతిమం అని వ్యాఖ్యానించారు. అయితే తాను తప్పు చేసినట్లు మండలి ఛైర్మన్ స్వయంగా ప్రకటించారని..అందువల్ల దీనిపై తానేమీ మాట్లాడనని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఓ ఛానల్ తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. రెండు బిల్లులపై చర్చ సందర్భంగా ఓ దశలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘర్షణ చోటుచేసుకుంటుందా అనే స్థాయిలో పరిస్థితులు వెళ్ళినా కొంత మంది సభ్యుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. మండలిలో ఎలాగైనా బిల్లును అడ్డుకోవాలని వ్యూహంతో వ్యవహరించిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చుని సభ కార్యక్రమాలను వీక్షించారు.

Next Story
Share it